
land grabbing allegations against tdp leaders
దొంగే దొంగని అరిచినట్లుగా ఉంది టీడీపీ వ్యవహారం. టీడీపీ హయాంలో విశాఖ జిల్లాలో అందినకాడికి భూములు దోచేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు అధికార పార్టీపై భూకబ్జా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూకబ్జా రాబందుల చిట్టా అంతా వెలికితీసింది. మొత్తం 430 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించగా… ఇందులో సింహ భాగం టీడీపీ కబ్జాకోరుల చేతుల్లోనే ఉండటం గమనార్హం. తిరిగి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కబ్జాదారులకు చెక్ పెట్టింది.
టీడీపీ నేతల కబ్జా చిట్టా :
పోరంబోకు, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, గుట్టలు, ఇనాం, గ్రామ కంఠాలు… ఇలా దేన్ని వదలకుండా టీడీపీ నేతలు యథేచ్చగా కబ్జాలు చేసేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో ఏకంగా 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీని ఆనుకుని ఉన్న ఈ స్థలంపై కన్నేసిన మూర్తి.. టీడీపీ ప్రభుత్వ అండదండలతో ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ భూమి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుంది.
అలాగే, కొందరు టీడీపీ నేతలు బినామీ పేర్లతో రూ.వేల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించేశారు.
కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబర్ 33-2లో ప్రభుత్వ భూమిని, అందులోనే ఉన్న గుడిని సైతం కబ్జా చేసేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న స్థానిక యువతపై దాడికి తెగబడ్డారు.
ఉక్కుపాదం మోపిన వైసీపీ సర్కార్
వైసీపీ అధికారంలోకి రాగానే భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. భూకబ్జాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించింది. రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రాంతాల్లో మొత్తం 430.81 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించాయి. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని కబ్జాకోరులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. కబ్జాకు గురైన 430.81 ఎకరాల భూమి విలువ సుమారు రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.