
ysrcp govt plans road shows in five major cities and in foreign countries
ఏపీకి పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా వైసీపీ సర్కార్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. దీన్ని విజయవంతం చేసేందుకు పలు సన్నాహక కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందుకోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోడ్ షోల ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉండే అనుకూలాంశాలను, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. తద్వారా విశాఖలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు ఇన్వెస్టర్లను ఆకర్షించనున్నారు.
ఏయే నగరాల్లో రోడ్ షోలు :
దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీతో పాటు తైవాన్, జపాన్, సౌత్ కొరియా, బ్రిటన్, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దావోస్‌లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలలో మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొననున్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ఉండే అనుకూల పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం మూడు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులు, ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులు, కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యేంతవరకు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు తదితర విషయాలను వారు ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
పెట్టుబడుల ఆకర్షణకు రోడ్ షోలతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆయా కంపెనీల అభిప్రాయాలను కూడా ఇన్వెస్టర్లకు తెలియజేసేలా ఈ ప్రచారం ఉండనుంది. తద్వారా ఇన్వెస్టర్లలో మరింత నమ్మకాన్ని కలిగించినట్లవుతుందని భావిస్తోంది.
వచ్చే ఏడాది కూడా జగన్ దావోస్ టూర్ :
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంను కూడా ఏపీ ప్రభుత్వం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు సీఎం జగన్ నేత్రుత్వంలోని ఏపీ బృందం అక్కడికి వెళ్లనుంది. పెట్టుబడులే లక్ష్యంగా జగన్ దావోస్ టూర్ ఉండనుంది. ఈ ఏడాది జరిగిన దావోస్ ఎకనమికల్ ఫోరంకు కూడా సీఎం జగన్ హాజరైన సంగతి తెలిసిందే. జగన్ దావోస్ టూర్‌తో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఏపీకి భారీ పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.