
CM YS Jagan over clean sweep elections
గత అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 151 స్థానాల్లో జయకేతనం ఎగరేసి చారిత్రక విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకుంది. 175కి 175 స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తప్పక 175 సీట్లు కట్టబెడుతారని జగన్ నమ్మకంగా ఉన్నారు. ఇందుకోసం వైసీపీ శ్రేణులంతా ఒక్కటై కష్టపడితే క్లీన్ స్వీప్ లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతున్నారు. తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టెక్కలి వైసీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో క్లీన్ స్వీప్పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
175కి 175 కొట్టడం సాధ్యమే : సీఎం జగన్
‘ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో 92 శాతం ఇళ్లకు, పట్టణాల్లో 80 శాతానికి పైగా ఇళ్లకు చేరుతున్నాయి. ప్రతీ ఇంటికి మంచి జరుగుతోంది. మంచి జరిగిన ఆ ప్రతీ ఇల్లు మనల్ని ఆశీర్వదిస్తే 175కి 175 స్థానాలు కొట్టడం సాధ్యమే. గ్రామాల రూపు రేఖలు మారిపోతున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్స్.. ఇలా ప్రజల కళ్లెదుటే ఇంత అభివృద్ధి జరుగుతోంది. కాబట్టి 175కి 175 స్థానాలు కొట్టగలం. చిన్న చిన్న విభేదాలు పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.’ అని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
కలిసి నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం : సీఎం జగన్
ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకతతో అర్హులైన కుటుంబాలన్నింటికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని సమావేశంలో జగన్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న మంచిని మనమే ప్రజల్లోకి వెళ్లి వివరించాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలకు మంచి చేశామని సగర్వంగా తలెత్తి చెప్పేలా పాలన సాగుతోందని… ప్రజలు కూడా మనమే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. మీరూ, నేను కలిసికట్టుగా పనిచేసి క్లీన్ స్వీప్ సాధించగలమని పేర్కొన్నారు.