
టీడీపీ-జనసేన-ఎల్లో మీడియా కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. ‘అక్టోబర్లో విశాఖపట్నంలో విశాఖ గర్జన జరిగింది. అదేరోజు పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద మంత్రులు, మా పార్టీ నాయకులపై దాడి జరిగింది. ఆ తర్వాత పరిణామాలు చూస్తే పవన్ కల్యాణ్ విశాఖలో చేసిన డ్రామా, ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ లో పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్ ను, చంద్రబాబు కలిశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ జగన్ మోహన్ రెడ్డిని వెంటనే కుర్చీ నుంచి దించేయడానికి అన్ని శక్తులు ఏకం కావాలని వారు పిలుపు నివ్వడం, మళ్లీ వాళ్లు వెనక్కి వెళ్లడం చూశాం. తాజాగా వాయిదాల పద్దతిలో ఇప్పటం గ్రామానికి పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్, ఆ తర్వాత నారా లోకేష్ పర్యటనలు చూశాం. అంతకు ముందు రోజే చంద్రబాబు నందిగామ పర్యటనలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం చూశాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, అందుకు పొత్తులకు సిద్ధమని పవన్ డిక్లరేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పొత్తులపై ఇంకా చర్చలే పూర్తి కాలేదని కొద్దిరోజులు, సమస్యలు ఉంటే కలిసి పనిచేస్తామని కొద్దిరోజులు చెప్పుకొచ్చారు. మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కలుస్తున్నామని చెప్పడం చూశాం. చంద్రబాబు, పవన్ కలవక తప్పని పరిస్థితులను సృష్టించి ,ఊహాజనితమైన సన్నివేశాలను సృష్టించి తర్వాత తమ కలయిక చారిత్రక అవసరంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీరి దురాలోచన, దుష్టబుద్ధి, కుట్రపూరితమైన చర్యలే కనిపిస్తున్నాయి తప్ప అంతకు మించి మరొకటి లేదు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండించడమే కాక పూర్తి వాస్తవాలను ఎప్పటికప్పుడూ ప్రజలకు వివరిస్తున్నామ’ని సజ్జల పేర్కొన్నారు.

కలిసి మోసం చేశారు.. మళ్ళీ కలిసిపోయేందుకే డ్రామాలాడుతున్నారు
‘ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి … గేర్ అప్ కావడానికి ప్రతిపక్షాలు ఏకం కావడానికి సన్నాహాలు చేసుకోవడంలో తప్పులేదు. నిజాయితీ, నిబద్ధత ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ … ఏ కారణాల వల్ల తాము కలిసి పోటీ చేయాలనుకుంటున్నారో ప్రకటిస్తే తప్పులేదు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటే వాటిని చెప్పడంలో తప్పులేదు. కానీ వాళ్లు ఇవేమీ చేయడం లేదు. ఏదో ఒక సంఘటన మీదనో, జరిగిన పరిణామాల మీదనో, టీడీపీ, జనసేన విడివిడిగా లోపాలను ఎత్తి చూపేలా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి మోసం చేశారని ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టెంపో క్రియేట్ చేసి, దాని ద్వారా న్యాయబద్ధంగా మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక అభిప్రాయం తెచ్చేందుకే వీరి డ్రామాలు’ అని సజ్జల అన్నారు.
పవన్ సభకు స్థలాలిచ్చిన ఏ ఒక్కరి గోడలూ కూల్చలేదు.
‘ఇప్పటం ఘటనే చూస్తే.. పవన్ కల్యాణ్ అంత ఆవేశంగా ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. పవన్ సభకు స్థలం ఇచ్చినవారిలో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు. పవన్ ఎందుకంత ఆవేశపడిపోయాడో, ఊగిపోయాడో ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకుని చూశాం. పవన్ కల్యాణ్ సభకు స్థలాలు ఇచ్చిన ఏ ఒక్కరూ ఆక్రమణల తొలగింపులో లేరు. ఆక్రమణలు తొలగించిన ఆరుగురు, ఎనిమిది మంది వివరాలు తెప్పించుకుని చూస్తే ఒక్కరు కూడా పవన్ సభకు భూములు ఇచ్చినవాళ్లు లేరు. ఇళ్లు కూల్చేశారన్నది శుద్ధ అబద్ధం అయితే… సభకు భూములు ఇచ్చిన వారెవరివీ గోడలు కూడా కూల్చలేదు. రోడ్డు విస్తరణ నేపథ్యంలో ప్రభావితం అయ్యే ఒకే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే … దాని జోలికి కూడా అధికారులు వెళ్లలేదు. మరి ఎందుకు పవన్ కల్యాణ్ కు అంత కోపం వచ్చింది. ఆయన మాటలు, చేష్టలు… వాహనం టాప్ మీద ఎక్కి ఊరేగడం కానీ.. ఆ రోజు జరిగిన డ్రామాను ప్రజలంతా గమనించారు. అంతకు ముందు రోజు జరిగిన చంద్రబాబు కాన్వాయ్ పై రాయి ఘటన, ఆ తర్వాత రోజు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటన చూస్తే.. వాళ్లకు వాళ్లు ఓ సంఘటనను సృష్టించుకున్నట్లు ఉంద’ని సజ్జల పేర్కొన్నారు.
అదే మాయ, అవే కుట్రలు
‘2014-19 మధ్యలో కూడా లేని సమస్యలను, సంఘటనలు సృష్టించడం చూశాం. చంద్రబాబు నాడు- నేడు లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించాడు. అమరావతి మొదలుపెట్టి మొత్తం మాయాబజార్ సృష్టించారు. కరోనా విపత్కర సమయం మినహాయిస్తే, మూడేళ్లలోనే ఇంత అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నా ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేస్తున్నాం. ఎన్నడూ లేనివిధంగా ఏదో పథకం ద్వారా 80శాతానికి పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తోంది. వాటిని మాత్రం ఎల్లో మీడియా ప్రసారం, ప్రచారం కూడా చేయద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.