
ysr rythu bharosa
రైతు భరోసా నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సభా వేదికగా.. ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 50.92 లక్షల మంది రైతన్నలకు మొత్తం రూ.2,096.04 కోట్ల నగదును సీఎం జగన్ విడుదల చేశారు.
రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందచేయనుంది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీనే కావడం గమనార్హం. 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు రూ.7,000 కోట్లను రైతు భరోసా ద్వారా అందచేసి ఆదుకుంటోంది.
రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది.
తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అందిస్తామని మేనిఫెస్టోలో మాటివ్వగా సీఎం జగన్ ప్రభుత్వం అంతకుమించి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందచేస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న రూ.17,500.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నలకు సీఎం జగన్ ప్రభుత్వం దాదాపు రూ.1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ రైతు భరోసా, ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.