
ysr
ఓటమెరుగని ప్రజానేత, రాజకీయాల్లో ముక్కుసూటితనంతో దూసుకెళ్లిన మగధీరుడు. ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల కోసమే జీవితాన్ని అర్పించిన సమాజ సేవకుడు వైఎస్సార్(యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి). విద్యార్థి దశలోనే రాజకీయాలకు ఓనమాలు దిద్ది మంత్రి స్థాయికి, పీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి, చివరకు ముఖ్యమంత్రిగా ఎదిగారు. దిగ్విజయంగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించి ప్రజాసేవలోనే తనువును చాలించారు.
ప్రజాప్రస్థానం పేరుతో 1470కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ప్రజలతో ఉంటూ.. ప్రజావసరాలను తెలుసుకుని తరాలు గుర్తుండిపోయే నాయకుడిగా నిలిచిపోయారు. ఆ యాత్రలో పురుడుపోసుకున్న “ప్రజా మేనిఫెస్టో” రైతును రాజు చేసింది, నిరుపేదకు వైద్యం అందించింది, మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు ఉచిత విద్య అందించింది.
పాదయాత్ర:
అది 2004. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిస్తేజం నిండిపోయింది. రాష్ట్రమంతటా దుర్భర స్థితి తాండవిస్తోంది. రాష్ట్రంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో సమస్యలను ప్రజలకు నాయకులకు మధ్య దూరాన్ని తగ్గించాలనుకున్నాడు ఆ మహానేత. పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా కలియదిరిగి కోట్ల మంది మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ప్రజా సంక్షేమమే ప్రధాన ఉద్దేశ్యంగా పనిచేసిన ఆయన అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. దిగువ, మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకునే పాలనను అందించారు. వైఎస్సార్ హయాంలో ఆరంభమై అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తున్న కార్యక్రమాలివే.
కాంగ్రెస్ బంపర్ మెజారిటీ
పాదయాత్ర ఫలితంగా 2004 ఎన్నికల్లో 138 సీట్ల మెజారిటీతో గెలిచింది కాంగ్రెస్. అధికారంలోకి రాగానే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు.
ఐదేళ్ల పదవీ కాలం తర్వాత 2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టారు.
సంక్షేమ పథకాలతో సంచలనం
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి.
వరించిన విజయాలు
1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.[18]
దక్కించుకున్న పదవులు
1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
మరణం:
సీఎం హోదాలో సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరారు వైఎస్సార్. అదే రోజు ఉదయం 9గంటల 35 నిమిషాలకు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. ఆయనతో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో కనుమరగయ్యారు. అభిమాన నేతకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా పలువురు మరణించారు. నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది.