
వైద్యరంగంలో ఒక సంచలనం ఆరోగ్య శ్రీ. ఇది పేద ప్రజల సంజీవిని. దేశం దృష్టిని రాష్ట్రం వైపు మళ్లించిన పథకం ఇది. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి మస్తిష్కంలోంచి ఉద్భవించిన ఆలోచన. వైఎస్ మానస పుత్రికగా చెప్పుకునే.. ఈ పథకం రాజశేఖరరెడ్డిని ప్రతి పేద కుటుంబానికి దగ్గర చేసింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ అనేది ఆరోగ్య బీమా పథకం. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు వైద్య సహాయం అందించడానికి తీసుకొచ్చారు వైఎస్సార్. తెల్లకార్డుదారులు రూ. 2 లక్షల వరకు వైద్యపరమైన సేవలు అందేలా దీన్ని రూపొంచించారు.
2007లో 3 జిల్లాల్లో 163 వ్యాధులకు పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. మంచి ఫలితాలు ఇవడం వల్ల.. రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించారు వైఎస్. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు,న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శం..
దేశంలోని వైద్య రంగంలో గుణాత్మక మార్పులను తీసుకొచ్చిన పథకం ఆరోగ్య శ్రీ. ఈ పథకాన్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. పేదరికం వల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న నిర్ణయంతో వైఎస్ఆర్ ఈ పథకాన్ని అనేకమంది అభాగ్యులకు ఆయువు పోసింది. వైద్యం పరంగా కేంద్రం తీసుకొచ్చిన పథకాలకు.. ఇదే స్ఫూర్తి అనడంలో అతిశయోక్తి లేదు.
జగన్ కొనసాగింపు..
జగన్ అధికారంలోకి వచ్చాక.. అరోగ్య శ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంచెలంచెలుగా సేవలను పెంచుతూ వస్తున్నారు. ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మరో 754 ప్రొసీజర్లను పథకంలో చేర్చనున్నారు. కొత్తగా చేర్చే వాటితో కలిపి మొత్తం 3,118 ప్రొసీజర్లకు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. సెప్టెంబరు 5వతేదీ నుంచి కొత్త ప్రొసీజర్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పేదలకు మరిన్ని సేవలు అందనున్నాయి.
108, 104 సేవలు..
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆసుపత్రులకు చేరుకోవడంతో పాటు గర్భిణీ స్త్రీలను ఉచితంగా తరలించడానికి వైఎస్ఆర్ 108, 104 సేవలను ప్రారంభించారు. దీనికి ‘ఎమర్జెన్సీ అంబులెన్స్ స్కీమ్’గా నామకరణం చేశారు. ఈ రకమైన సైవలను ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైఎస్సార్ తీసుకొచ్చిన ఈ సేవలు.. ఇప్పుడు 15 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, గోవా, మేఘాలయ, మధ్యప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ సేవలను అందిస్తున్నాయి.
మొబైల్ మెడికల్ యూనిట్లుగా పిలిచే 104 సేవలను కూడా వైఎస్సార్ ప్రారంభించారు. ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలు, గ్రామీణ గిరిజన ప్రాంతాలలో నివసించే ప్రజలకు వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల లక్ష్యం.
తన తండ్రి తీసుకొచ్చిన ఈ సేవలను రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. జూలై 1, 2020న అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడానికి 1,088 (108, 104) అంబులెన్స్‌లను ప్రారంభించారు సీఎం జగన్.