
సంక్షేమానికి కొత్త ఒరవడిని నేర్పాడు..
పాలనను సరికొత్త పుంతలు తొక్కించాడు..
చరిత్రలో చాలామంది కలిసిపోతారు.. కానీ అతను చరిత్ర గుర్తు పెట్టుకునే నాయకుడయ్యాడు..
ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..
వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్.. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నవ్యాంధ్రకోసం శ్రమిస్తున్నారు. వైఎస్సార్ కే.. కాదు ఆయన సంక్షేమానికి కూడా నిజమైన వారసుడిగా దూసుకుపోతున్నారు. గురువారం( సెప్టెంబర్ 2) దివంగత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. ప్రత్యేక కథనం..
అందరు నాయకులు జనంలో నుంచి పుడితే.. వైఎస్సార్ మాత్రం జనం కోసం పుట్టారు. అది ఆయన అందించిన ఆరేళ్ల పాలనే స్పష్టం చేస్తుంది. 2004లో ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు పావల వడ్డీ రుణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వై.ఎస్. నిలిచిపోయారు. ఇతర రాష్ట్రాల్లో అవి నేటికీ అమవుతున్నాయి.
తండ్రి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే.. ప్రసుత్త సీఎం జగన్ రెట్టించిన ఉత్సాహంతో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి నిజమైన భాష్యం చెప్పిన ఆ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రైతులకు ఉచిత కరెంట్..
తన పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ఆర్.. ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మే 14, 2004 న రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంటు ఫైల్ పై సంతకం చేశారు. సరికొత్త శకానికి నాంది పలికారు. అప్పటి నుంచి ప్రభుత్వం అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు పగటిపూట ఏడు గంటల ఉచిత, నిరంతరాయ విద్యుత్‌ను అందించింది. ఇది అప్పట్లో దేశంలోనే సంచలన నిర్ణయం. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అందించిన ఏకైక నాయకుడిగా వైఎస్సార్ నిలిచిపోయారు. 2013 నాటికి రైతుల విద్యుత్ కోసం 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
ప్రస్తుతం సీఎం జగన్.. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆ పథకానికి మరింత మెరుగులుదిద్దారు. ప్రస్తుతం ఏపీలో 9గంటలు ఉచిత కరెంట్‌తోపాటు.. రైతు భరోసా కింద రైతులకు 13,500 అందజేస్తోంది జగన్ సర్కారు. రైతలకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చారు.
జలయజ్ఞం..
వ్యవసాయానికి సాగునీటి కొరత లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలన్న లక్షంతో చేపట్టిన కార్యక్రమమే జలయజ్ఞం. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చారు వైఎస్సార్. ఏకంగా 86 ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు వైఎస్. రాజశేఖర్ రెడ్డి 95,539 లక్షల కోట్ల నిధులు కేటాయించి కొత్తగా 24 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చారు. ఏళ్లుగా బీళ్లుగా పడి ఉన్న నేలలకు నీరందించి అన్నదాత భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన రైతుబాంధవుడు వైఎస్సార్.
జగన్ అధికారంలోకి వచ్చాక తండ్రి మాదిరిగానే సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు జగన్. ముఖ్యంగా పోలవరంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం పోలవరం పనులు 80 శాతం పనులు పూర్తయ్యాయి.
ఫీజు రీయింబర్స్మెంట్..
ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యా రంగంలో వైఎస్సార్ విప్లవం తీసుకొచ్చారనే చెప్పాలి. అందరికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో.. ఈ పథకాన్ని తీసుకొచ్చారు వైఎస్సార్. ఆర్థికంగా వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 33 లక్షల మంది లబ్ధి పొందారు.
వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఈ పథకం నుంచి ప్రేరణ పొందిన వైఎస్ జగన్.. 2019లో సీఎం విద్యారంగంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పేద వర్గాల విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు
రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్ 2006లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ సామూహిక గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు లేని పేదలకు ఇళ్లను అందించారు. 2006-2009 మధ్య ఈ పథకం ద్వారా దాదాపు 40 లక్షల మంది లబ్ధి పొందారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఏటా 20 లక్షల ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇళ్ల మంజూరు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్ ఆవాస్ యోజన కింద జగన్ పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు.
పావలా వడ్డీ పథకం..
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మహిళలకు సహాయం చేయడానికి వైఎస్ఆర్ పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని స్వయం సహాయక సంఘాలకు (డ్వాక్రా) ఉచిత రుణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంతో ఆయన హయాంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందారు.
వైఎస్సార్ అడుగుజాడల్లోనే ఏపీ సీఎం జగన్ కూడా సున్నా వడ్డీ రుణ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద 8.78 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ప్రయోజనం ఈ పథకం కింద లభ్ది పొందారు.
వృద్ధ్యాప్య పింఛన్ల పెంపు
వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా ఫించన్లు అందే ఏర్పాటు చేశారు వైఎస్సార్. వైఎస్ రాక ముందు ఉమ్మడి ఏపీలో 16లక్షలు మాత్రమే ఉన్న పింఛను లబ్ధిదారులు.. ఆయన సీఎం అయ్యాక 71లక్షలకు పెరిగారు. అంటే కొత్తగా.. 55లక్షల కొత్త పింఛన్ల మంజూరు జరిగింది. వితంతువులకు, వికలాంగులకు, మనోవైకల్యం ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేసి తన పెద్దమనసును చాటుకున్నారు వైఎస్సార్.
ఇప్పడు అదే పనిని ఆయన కుమారుడు వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పింఛన్ల పేరుతో జగన్ అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నారు జగన్. ప్రస్తుతం లబ్ధిదారులు రూ.2,500 చొప్పున అందుకుంటున్నారు. వికలాంగులు రూ. 3000చొప్పున అందుకుంటున్నారు.
రెండు రూపాయలకు కిలోబియ్యం..
వైఎస్సార్ తీసుకొచ్చిన మరో ప్రజాప్రయోజన పథకం రూ. 2 కిలో బియ్యం. ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడింది. వైఎస్సార్‌ను తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది బాగా దగ్గర చేసింది. రాష్ట్రంలో పేదరికంతో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం సుమారు 1.82 కోట్ల తక్కువ ఆదాయ కుటుంబాలకు సహాయం చేసింది.