
Nandyala tour
- రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవంలో సీఎం జగన్
పారిశ్రామిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేయూతనిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం స్పష్టం చేశారు.
రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు రావాలంటే.. అది గ్రీన్ ఎనర్జీ ద్వారా సాధ్యం అవుతుందని తాను నమ్ముతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఫలితంగా రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. అందుకే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందుకే గ్రీన్కో, ఇండోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు ఈ మధ్య కాలంలోనే రూ.72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్ లో 20 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.
“ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్ తొలి దశ మాత్రమే. ఇది ఇంకా విస్తరిస్తూ పోతుంది. దాని వల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా మంచి జరుగుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎలాగూ చట్టం చేశాం కాబట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి.”
– సీఎం జగన్
కొలిమిగుండ్ల మండలంలో పరిశ్రమ ఏర్పాటు కోసం 5,000 ఎకరాల భూములు సేకరించారు. నైనపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల్లో దశలవారీగా రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 1790 కోట్లు.
భారీ పరిశ్రమ అయిన రామ్ కో ప్లాంట్ ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 30 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంటును కంపెనీ సొంతంగా ఏర్పాటు చేయనుంది. భూములిచ్చిన రైతు కుటుంబాలకు పరిశ్రమలో ఉద్యోగాలు అందించడమే కాకుండా, అదనంగా 1050 ఉద్యోగాలను త్వరలో కల్పించనున్నారు.
రూ.2500 కోట్ల పెట్టుబడితో..
నంద్యాలలో రామ్‌కో సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం.. దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన తొలి దశ ప్లాంట్‌తో దాదాపు 1000 మందికి ఉద్యోగవకాశాలు కూడా వచ్చే ఒక మంచి పని ఇక్కడ జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కూడా కేవలం 30 నెలల్లోనే, అంటే 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ప్రాజెక్టు మొదలైందన్నారు.
కర్నూలుకు మేలు:
ఇక్కడ ఇటీవలే గ్రీన్కో ప్రాజెక్టు తలపెట్టిన 5400 మెగావాట్ల కెపాసిటీతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి.. పంప్ స్టోరేజీతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కొద్ది నెలల క్రితమే తాను పునాది రాయి వేసినట్లు చెప్పుకొచ్చారు సీఎం జగన్. దీని వల్ల దాదాపు దాదాపు 2600 ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది కర్నూలు జిల్లాకు మేలు జరుగుతుందన్నారు.
ఎకరాకు రూ.30వేలు..
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు లీజుకిచ్చి సహకరించే రైతులకు ప్రభుత్వం ఏటా రూ. 30,000 ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. మూడేళ్లకోసారి 5 శాతం పెంచుతూ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ లీజు 30 ఏళ్లు కావొచ్చు.. లేదా 50 ఏళ్లకు కావొచ్చు అన్నారు. ఒక లొకేషన్లో కనీసం 500 మెగావాట్ల ఉత్పత్తి చేసే విధంగా ప్రాజెక్టు రావాలంటే.. కనీసం 1500 నుంచి 2 వేల ఎకరాల వరకు భూమి కావాల్సి ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. ఆ మేరకు రైతులు క్లస్టర్‌గా ఏర్పడి.. ముందుకు రావాలన్నారు.
సీఎస్ఆర్ కింద అభివృద్ధి పనులు:
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీఎస్ఆర్ కింద 2019-22 మధ్య రూ. 8.5 కోట్లు ఖర్చు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.