
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, రాష్ట్రానికి భారీ మొత్తంలో ఆదా చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశేష పాత్ర పోషించిందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అందుకు సంబంధించి టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పై తీవ్ర విమర్శలు చేశారు.
తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం: రాష్ట్రానికి భారీ ఆదా
2021 డిసెంబర్ 1న కేంద్ర ప్రభుత్వ సంస్థ SECI తో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. యూనిట్ విద్యుత్ కేవలం రూ. 2.49 ధరకు ఈ ఒప్పందం జరుగగా, ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధర. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి ప్రతి ఏటా రూ. 4,000 కోట్ల మిగులు లభించనుంది. మొత్తం 25 ఏళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు ఆదా కానుందని తెలిపారు.
చంద్రబాబుకు మంచి నాయకత్వమా?
సోలార్ విద్యుత్ కొనుగోళ్లను ప్రస్తావించిన జగన్, టీడీపీ ప్రభుత్వం 2014లో యూనిట్ రూ. 6.49కి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నదని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో విద్యుత్ సగటు కొనుగోలు ధర యూనిట్ రూ. 5.4గా ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 2.49కే ఒప్పందం కుదుర్చిందని అన్నారు. “రాష్ట్రానికి డబ్బులు ఆదా చేసిన నేను మంచోడినా, అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు మంచోడా?” అంటూ జగన్ ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారం
టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్ విమర్శించారు. “SECI మరియు ఏపీ ప్రభుత్వం మధ్య నేరుగా జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ లభించడానికి కారణం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. అలాంటప్పుడు మా పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం టీడీపీకి సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
రాష్ట్రానికి సంపద సృష్టి: వైఎస్సార్ సీపీ లక్ష్యం
విద్యుత్ రంగంలో వ్యయ తగ్గింపు ద్వారా రాష్ట్రానికి సంపద సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. “రాష్ట్రానికి గౌరవం తీసుకురావడం, ప్రజలకు ప్రయోజనం కలిగించడమే మా ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం” అని పేర్కొన్నారు.