ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో గుంటూరు మిర్చి కారం ఘాటును పెంచేసింది. రైతుల గోడు పట్టని ప్రభుత్వానికి మిర్చి రైతుల ఘాటు తగిలింది. గుంటూరు మిర్చి రైతుల కోసం వైఎస్సార్ సీపీ అధినేత జగన్ చేపట్టిన మిర్చి యార్డు పర్యటనతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకు మిర్చికి ధరలు లేవు పట్టించుకోవాలంటూ రైతులు, రైతు సంఘాలు వినతులు ఇచ్చినా వారిని పట్టించుకోలేదు. తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శించి మిర్చి కొనుగోలు ధరల పెంపు కోసం పర్యటించారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వం పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా మిర్చి యార్డు సందర్శించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు దిగొచ్చారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారో లేదో.. ఇలా కొన్ని గంటల వ్యవధిలో సీఎం చంద్రబాబు స్పందించారు. మిర్చి రైతులకు ధరల విషయంలో మద్ధతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. జగన్ పర్యటనకు ముందు మిర్చి రైతుల కష్టాలు చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వానికి కనిపించలేదా అని నెట్టింట సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాసిన లేఖలో మిర్చి రైతులను ఆదుకుని.. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ను కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చి పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు అమ్ముకునే ధరకు, సాగు వ్యయానికి మధ్య పొంతన ఉండటం లేదని ఈ సందర్భంగా లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇటీవల కాలంలో మిర్చి ధరలు బాగా పడిపోయాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాధారణ మిర్చి క్వింటాల్‌కు రూ.11 వేలు, ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ.13 వేలకు పడిపోయిందని వివరించారు. గతంలో మిర్చి ధర రూ.20 వేలు ఉండేదని గుర్తుచేశారు. మిర్చి ధరలు బాగా తగ్గిపోవడంతో రైతులు పెట్టుబడులు రాక ఆర్థికంగా కుదలవుతున్నారని తెలిపారు. రైతులు అమ్ముకునే ధరకు, సాగు వ్యయానికి మధ్య పొంతన ఉండటం లేదన్నారు. 50 శాతం నిష్పత్తిలో కాకుండా 100 శాతం నష్టాన్ని కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు.