
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది. ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సిద్దం కావాలని శుక్రవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తమ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మరి వైసీపీ ఎలా పోటీ చేయబోతుందనే విషయంపై చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లనున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజలకు వైసీపీపై నమ్మకం ఉందన్నారు. ప్రజలు తమ వెంబడి ఉన్నందున ఎవరితోనూ పొత్తులు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్ కు ప్రజల మద్దతు పుష్కలంగా ఉందన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు అండగా నిలుస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సజ్జల. పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం చంద్రబాబు శాపంగా మారారన్నారు. ప్రత్యేక హోదా కోసం శక్తి మేరకు తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే చంద్రబాబును అక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో పట్టు కోల్పోతున్నట్లు చంద్రబాబుకు అర్థమైనట్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో చంద్రబాబు సీఎం కాలేదని, సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయన గద్దెనెక్కారన్నారు రామకృష్ణారెడ్డి. 30 ఏళ్లుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించలేని చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు నిర్మించాలని అడుగుతున్నారన్నారు.
చంద్రబాబు ఆలోచనలు దరిద్రమైనవని సజ్జల అన్నారు. పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కృషి చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుకు పేదలపై అంత ప్రేమ ఉంటే.. 2014లో సీఎం అయ్యాక ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.