
Pm modi ap tour
ఈనెల 11న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే బీజేపీ మిత్రపక్షం అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని పర్యటనలో భాగంగా నిర్వహించే సభలో పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే ప్రధాని పర్యటనపై బీజేపీ స్పందించింది. విశాఖలో నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతికే భాజపా కట్టుబడి ఉందని.. ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదని స్పష్టం చేశారు. 11వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా సోము వీర్రాజు సమాధానం చెప్పలేదు.
ప్రధాని సభకు హాజరు కావడానికి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల బీజేపీతో పవన్ కల్యాణ్ అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే బీజేపీ అగ్రనాయకత్వం పవన్ దూరం పెట్టారనే వాదన వినిపిస్తోంది.
అయితే ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ కల్యాణ్ మొదటి నుంచి వ్యతిరిస్తున్నారు. ఆ ప్రైవేటీకరణకు మద్దతుగానే ఆహ్వానం అందినా.. సభకు హాజరయ్యేందుకు విముఖత చూపినట్లు సమాచారం.