
Nara Lokesh
తెలుగనాట రాజకీయాల్లో పాదయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గతిని మార్చిన శక్తి పాదయాత్రలకు ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారా? 2019లో జగన్ ను ఆదరించినట్లు లోకేశ్ ఆదరిస్తారా? ఈ పాదయాత్ర టీడీపీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా?
2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నారా లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి యాత్ర ముగిసేలా రూట్‌మ్యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని టీడీపీ భావిస్తోంది.
పాదయాత్ర ఎవరు చేసినా.. స్వాగతించాల్సిందే. అయితే ఇక్కడ పాదయాత్ర చేస్తున్నది లోకేశ్ కావడం.. కాస్త ఆలోచించాల్సిన విషయం. లోకేశ్ పాదయాత్ర వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. పాదయాత్ర పేరుతో లోకేశ్ ను టీడీపీ తమ అధినేతగా ఎక్స్ పోజ్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు తర్వాత తానే అన్న సంకేతాన్ని లోకేశ్.. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పాదయాత్ర విజయవంతమై.. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇది జరుగుతుంది. అప్పుడు లోకేశ్ హీరో అవుతాడు.
టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం మరి లోకేశ్ పాదయాత్రకు ఉందా? అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం అనే చెప్పాలి. జగన్ లాగా తాను పాదయాత్ర చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తా అనే భావనలో లోకేశ్ ఉండవచ్చు. అయితే ఇక్కడ జగన్ తో లోకేశ్ ను పోల్చలేము. జగన్ పాదయాత్ర చేసిన పరిస్థితులు వేరు.. లోకేశ్ పాదయాత్రకు ఉపక్రమిస్తున్న పరిస్థితులు వేరు. జగన్ స్వతంత్రంగా పార్టీ పెట్టుకొని.. ఒక వ్యవస్థను నిర్మించుకొని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్ఆర్ ఇమేజ్ కూడా జగన్ ను ప్రజలకు మరింత దగ్గర చేసింది. వైఎస్సార్ మరణం.. జగన్ పట్ల కాస్త సానుభూతిని కల్పించింది. అయితే లోకేశ్ పరిస్థితి వేరు. లోకేశ్ ను ఇంకా తండ్రి చాటు బిడ్డగానే టీడీపీ శ్రేణులు, ప్రజలు భావిస్తున్నారు.
స్పీచ్ విషయంలో..
పాదయాత్రలో స్పీచ్ అనేది చాలా కీలకం. అందులో లోకేశ్ ఇంకా పరిణతి సాధించాల్సిన అవరసం ఉంది. 2019 ఎన్నికల సమయంలో లోకేశ్ స్పీచ్ లలో దొర్లిన తప్పులను అందరూ చూసి ఉంటారు. అప్పటి నుంచి బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతుంటే.. టీడీపీ శ్రేణులు కాస్త భయపడుతుంటారు. 2019 ఎన్నికల తర్వాత స్పీచ్ లో లోకేశ్ కాస్త మెరుగు పడ్డారు. కానీ పూర్తి స్థాయిలో అతను సంసిద్ధుడు కాలేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
లోకేశ్ పాదయాత్ర తమకు ప్లస్ అవుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఒక వేళ.. పాదయాత్ర సమయంలో స్పీచ్ లో ఎలాంటి పొరపాటు చేసినా.. అది అసలుకే మోసం వచ్చినా రావొచ్చు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా.. ప్రత్యేకంగా లోకేశ్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంత శిక్షణ తీసుకున్నా.. సహజ లక్షణం వల్ల ఎదైనా పొరపాటు దొర్లితే.. అది కచ్చితంగా వైసీపీకి ఆయుధం అయ్యే అవకాశం ఉంటుంది.