
రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. లేదంటే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. రాజధాని రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జరిపిన న్యాయస్థానం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అనుమతిపై ఇంకా ఏ విషయం తెలపలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించగా.. ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. సంఘీభావంగా సీపీఎం బైక్ ర్యాలీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, హైకోర్టు తీర్పు కనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలని, అమరావతి ఉద్యమం వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంలో రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అమరావతిలో నేడు సీపీఎం బైక్ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బైక్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి సెంటర్లో ప్రారంభమైన బైక్ ర్యాలీ పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయ పాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి మీదుగా తుళ్లూరు వరకు జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యకర్తల పెద్ద సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక మూడు రాజదానుల పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని వ్యాఖ్యానించారు. హైకోర్ట్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి రూ. 42 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఒక్క అమరావతే కాదు రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అయినా సరే అమరావతి రాజధానిగా కొనసాగేలా చేస్తామని నినాదాలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి అభ్యతరం లేదని, కానీ పేదల పేరుతో ప్రభుత్వం భూములు అమ్మడానికి చూడటం సరికాదన్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.