
safe uttarandhra
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఎత్తుకున్నారు. ఈ నెల 15న ‘విశాఖ గర్జన’కు ఉత్తరాంధ్ర జనం సిద్ధమవుతున్న వేళ.. చంద్రబాబు ఇచ్చిన ఈ నినాదం ప్రాధాన్యత సంతరించుకున్నది. విశాఖను రాజధాని చేయొద్దని చెబుతున్న చంద్రబాబు నినాదాన్ని ప్రజలు ఏ మేరకు నమ్ముతారు? ఒక వైపు సేవ్ ఉత్తరాంధ్ర అని చెబుతూనే.. మరోవైపు వికేంద్రీకరణను అడ్డుకుంటున్న చంద్రబాబు ద్వంద్వ నీతి ఆమోదయోగ్యమేనా? విశాఖ గర్జనతో.. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదా? ఉనికి కోసమే చంద్రబాబు ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఎత్తుకున్నారన్న వైసీపీ నాయకుల మాటల్లో నిజమెంత?
మూడు రాజధానుల అంశం.. విశాఖపట్నం కేంద్రంగా రాజకీయ రగడను రాజేస్తోంది. అక్టోబర్ 15న విశాఖలో నిర్వహించే ‘విశాఖ గర్జన’పైనే ఇప్పుడు అందరి దృష్టి. విశాఖ గర్జనను విజయవంతం కాకుండా.. చంద్రబాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో ముందుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విశాఖను రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో.. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతున్న క్రమంలో.. తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ అధినేత సేవ్ ఉత్తరాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్నట్లు స్పష్టమవుతోంది.
విశాఖను రాజధానిగా వద్దంటూనే..
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని.. ఆ ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్రను చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఒక వైపు విశాఖను రాజధాని చేయొద్దంటూనే.. మరోవైపు సేవ్ ఉత్తరాంధ్ర అనడం.. చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి.. రాజధానికి మించిన సదవకాశం ఇంకా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కావాలనే చంద్రబాబు ఉత్తరాంధ్ర వరప్రదాయని అయిన విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
అప్పుడు రెండు కళ్ల సిద్ధాంతం అట్టర్ ప్లాప్..
రాజకీయ నాయకుల్లో చంద్రబాబు చాలా డిఫరెంట్ అని చెప్పాలి. పేరొచ్చే ఏ పని చేసినా.. తానే చేయాలి.. ఇంకెవరూ చేయొద్దు అనే అనుకుంటారు. క్రెడిట్ ఎవ్వరికీ పోనివ్వరు. ఇప్పుడు విశాఖ రాజధాని విషయంలో కూడా అదే ధోరణితో ఆలోచిస్తున్నారు. విశాఖ రాజధాని అయితే.. ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదు. ఏ కొంచెం బూస్ట్ ఇచ్చినా.. అన్ని రంగాల్లో దూసుకుపోయే లక్షణం వైజాగ్ కు ఉంది. ఇది గ్రహించిన చంద్రబాబు.. రాజధాని క్రెడిట్ ను జగన్ కు దక్కకుండా.. కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ‘సేవ్ ఉత్తరాంధ్ర’ అంటున్నారు.
అయితే ఇప్పటి ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదాన్ని.. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో పోల్చుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణ రెండు కళ్లు అంటూ.. సేఫ్ గేమ్ ఆడారు చంద్రబాబు. విభజన వల్ల మోసపోయేది ఆంధ్రా అని తెలిసినా.. రెండు కళ్ల సిద్ధాంతంతో నాడు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్లు వైసీపీ చెబుతోంది. ఇప్పుడు కూడా అలాంటి ధోరణినే చంద్రబాబు అవలంబిస్తున్నట్లు ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు.
టీడీపీ కోలుకోవడం కష్టమేనా ?
సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక.. అభివృద్ధి కాంక్షతోపాటు.. రాజకీయ వ్యూహం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. 2019లో ఘోర ఓటమిని చవి చూసిన.. టీడీపీని చావు దెబ్బ తీసే వ్యూహంతో.. సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి ఉత్తరాంధ్రలో.. కర్నూలును న్యాయ రాజధాని చేసి.. రాయలసీమను క్లీన్ స్వీప్ చేసే వ్యూహంతో చక్రం తిప్పుతున్నారు జగన్. ఇప్పుడు ఆ వ్యూహంతో చిక్కుకున్న టీడీపీ విలవిల్లాడుతోంది.
ఉనికిని చాటుకునేందుకు నానా తంటాలు పడుతోంది టీడీపీ. అమరావతి రైతుల పేరుతో పాదయాత్రను ప్రోత్సహిస్తున్నా.. రాష్ట్రం అంతటినీ ప్రభావితం చేసే అవకాశం లేదు. ఆ పాదదయాత్ర కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. తాజాగా విశాఖ గర్జన నేపథ్యంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్నట్లు గ్రహించిన చంద్రబాబు.. ‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో వైసీపీని కౌంటర్ ఎటాక్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్ని పథకాలు రచించినా.. టీడీపీని నమ్మే పరిస్థితిలో కనపడటం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖను రాజధాని చేయొద్దంటూ.. ఉత్తరాంధ్రను రక్షించాలని అనడం.. చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిదర్శనంగా అభిప్రాయపడుతున్నారు.
ఆరోజే అచ్చెన్న మీటింగ్..
జేఏసీ ఈ నెల 15న విశాఖ గర్జన చేపడుతుంటే.. అదే రోజు టీడీపీ మరో కార్యానికి పూనుకుంది. అచ్చెన్నాయుడు సారధ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ మీటింగ్ నిర్వహిస్తోంది. విశాఖ గర్జనకు కౌంటర్ గానే ఇది నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే విశాఖ రాజధానికి వ్యతిరేకంగా నిర్వహించే.. ఆ మీటింగ్ కు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. టీడీపీపై అభిమానాన్ని చంపుకోలేక.. తమ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేయలేక.. ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్లు.. స్తబ్దుగా ఉండిపోతున్నారు.
చంద్రబాబు ఇచ్చిన సేవ్ ఉత్తరాంధ్ర నినాదాన్ని కూడా స్వయంగా తెలుగుదేశం నేతలు వ్యతిరేకిస్తుండటం గమనార్హం. విశాఖ రాజధాని అయితే.. ‘ఉత్తరాంధ్ర సేఫ్’ అవుతుందని తెలుగు తమ్ముళ్లతోపాటు ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో విశ్వసిస్తున్నారు.