
maha padayatra 2.0
అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర సోమవారం ఆరంభమైంది. కొన్ని వర్గాల హడావుడి కూడా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయంలో హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే ‘మహా పాదయాత్ర’ను ప్రారంభించడం ఎవరి ప్రయోజనాల కోసమనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉదయిస్తున్నాయి. ప్రతిపక్షాల నేతలు, వారి అనుచరులు రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. రాజధాని బిల్లులను అసెంబ్లీలో ఉపసంహరించుకున్నాక కూడా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను ఒక పథకం ప్రకారం అనవసర అలజడికి గురిచేస్తూ, వారిని ఆందోళన దిశగా నడిపించే కార్యక్రమాన్ని కొందరు తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు.
రాజధాని వివాదం ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉండగా, అమరావతి నుంచి అరసవిల్లికి బయల్దేరిన రైతుల పాదయాత్ర ప్రశాంతంగా పూర్తవ్వాలని సమాజం ఆశిస్తోంది. ఉన్నత న్యాయస్థానం సూచనలతో పోలీస్ శాఖ కూడా అవసరమైన భద్రత కల్పిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ లో పాలన కేంద్రీకృతం కావడం వల్లే ప్రత్యేక తెలంగాణకు బీజం పడిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితి విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని అన్ని పార్టీలు భావించాలి. పాలనా వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకృతం కావడం అభిలషణీయం కాదు. దేశంలోని సీనియర్ రాజకీయవేత్తలు, మేధావులు కూడా అదే సూచిస్తున్నారు. ఆ దిశగానే రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది.
2019 డిసెంబర్లో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. అసెంబ్లీలో బిల్లులు కూడా ఆమోదించాక అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరుగుతున్న క్రమంలోనే రాజధాని బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ హామీకి అనుగుణంగా శాసనపరమైన చర్యలు తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణపై అన్ని ప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పాలని చూస్తోంది. ఇప్పటికిప్పుడు అమరావతిని అభివృద్ధి చేయాలన్నా వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో పాలనా రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను సంతృప్తి పరిచినట్లు ఉంటుంది. శాసన రాజధానిగా అమరావతి ఎలాగూ ఉంటుంది. వెనుకబడిన రాయలసీమను న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేసినట్లు అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.