
ysrcp
గుంటూరు జిల్లాలో రాజకీయాలు రాజకీయం రసవత్తరంగా మారాయి. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మంగళగిరిలో మంచి పట్టున్న గంజి చిరంజీవి వైసీపీలో చేరడం.. తాడికొండలో పార్టీ నిర్ణయాలు.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే జరుగుతున్నట్లు సమాచారం. ఇది సీఎం జగన్ వ్యూహంలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలతో తెరమీదకు వచ్చిన అంశాలు ఏంటి? ఈ రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు మారే అవకాశం ఉందా?
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉండగానే.. వ్యూహరచనపై సీఎం జగన్ దృష్టిపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే మంగళగిరి టీడీపీ కీలక నేత.. గంజి చిరంజీవి వైసీపీలోకి చేరినట్లు తెలుస్తోంది. అన్ని లెక్కలు వేసుకొనే చిరంజీవిని సీఎం జగన్ ను పార్టీలోకి ఆహ్వానించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. బీసీ నేత అయిన చిరంజీవి.. టీడీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
టీడీపీని చిరంజీవి ఎందుకు వీడారు?
బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి మంగళగిరిలో గట్టి పట్టున్న నాయకుడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో తన తనయుడు లోకేశ్ కోసం చిరంజీవిని పక్కన పెట్టారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు లోకేశ్. మంగళగిరి టికెట్ చిరంజీవికి ఇస్తే గెలిచి ఉండేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరడంతో సరికొత్త ఊహాగానాలను తెరలేచింది. మంగళగిరి నుంచి పార్టీ చిరంజీవి వైసీపీ తరపున పోటీచేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే దీన్ని ప్రచారంగా కొట్టి పారేయలేము అనేది రాజకీయ విశ్లేషకుల మాట. చిరంజీవిని వైసీపీలో చేర్చుకోవడం వెనుక కచ్చితంగా రాజకీయ మర్మం ఉండి ఉంటుందని టాక్. చేనేత నాయకుడిగా చిరంజీవికి మంగళగిరిలో గట్టి పట్టుంది.
చిరంజీవిలో పోటీ నిజమైనా?
వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి చిరంజీవి పోటీచేస్తారని వాదన బలంగా వినిపిస్తోంది. లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో లోకేశ్ పోటీగా వ్యూహాత్మంగా జగన్ చిరంజీవి బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. ఒకసారి తక్కువ ఓట్లతో ఒడిపోయారు. మరోసారి లోకేశ్ కోసం చంద్రబాబు కావాలనే పక్కన పెట్టారన్న సానుభూతి ఉంది. అంతేకాదు సామాజిక పరంగా, ఆర్థికంగా బలంగా చిరంజీవి బలమైన నాయకుడు. ఇలా అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్.. చిరంజీవిని పార్టీలోకి చేర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలో చిరంజీవిని నిలబెట్టే అవకాశమూ లేకపోలేదు.
మరీ ఆర్కే?
మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్థానికంగా చాలా బలమైన నాయకుడు. వరుసగా రెండుసార్లు గెలిచిన నాయకుడు. 2024లో ఆర్కే సత్తెనపల్లికి మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఆర్కే కూడా సుముఖంగా ఉన్నట్లు చర్చ జగురుతోంది. అయితే ఆర్కే వర్గీయులు మాత్ర ఇది అసత్య ప్రచారం అని చెబుతున్నారు. సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబుకు కాపులు ఎక్కువగా ఉండే మరో సిట్టింగ్ స్థానాన్ని కేటాయించే అవకాశమూ లేకపోలేదు.
ఎమ్మెల్యే ఆర్కే సైతం ఈ విషయంపై మౌనం వీడారు. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరిని నుంచి పోటీ చేయనున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇది పైపైకి అంటున్నారా.. లేక తన మనసులోని మాట అంటున్నారా అనేది తేలాల్సి ఉంది.
తాడికొండ పంచాయతీ..
తాడికొండ నియోజకవర్గ పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీదేవికి కాకుండా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు అప్పగించారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా డొక్కాను పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారనే చర్చ సాగుతోంది. ఇది నిజమైతే తన భవిష్యత్ ఏంటని శ్రీదేవి ఆలోచనలో పడ్డారు. కొన్ని రోజులుగా శ్రీదేవి వర్గీయులు.. డొక్కా నియామకాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జలను తన బాధను చెప్పుకున్నారు శ్రీదేవి. అయితే ఆమెకు సజ్జల నుంచి ఎలాంటి హామీ వచ్చిందనేది తేలాల్సి ఉంది. త్వరలో మాణిక్యవర ప్రసాద్ – శ్రీదేవితో కలిసి జగన్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం తుది నిర్ణయాన్ని జగన్ ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.