
Visakha garjana
విశాఖను పరిపాలన రాజధాని చేయాలనే ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ నెల 15న విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునివ్వడం.. దానికి వైసీపీ మద్దతు పలికిన నేపథ్యంలో.. విశాఖ రాజధాని అంశం మరింత కాక రేపుతోంది. ఇంతకీ వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎందుకు పరిపాలన రాజధాని చేయాలనుకుంది? విశాఖ చరిత్ర ఏంటి? రాజధానికి అవసరమైన వనరులు విశాఖలో ఉన్నాయా? అమరావతితో పోల్చితే విశాఖ ఎందులో బెటర్?
రాష్ట్రంలోనే పెద్ద నగరం..
విశాఖపట్నం రాష్ట్రంలోనే పెద్ద నగరం. ఏపీలో ఐటీ పరంగా, పారిశ్రామికంగా, రవాణా పరంగా మంచి వనరులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలో లేకపోయినా.. భవిష్యత్ లో అంతకు మించి అభివృద్ధి అయ్యే సత్తా ఉన్న నగరం. విశాఖపట్నానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. వందేళ్ల క్రితమే విశాఖ ఒక జిల్లా. స్వాతంత్ర్యానికి పూర్వమే విశాఖలో రైల్వే ట్రాక్, పోర్టును బ్రిటీష్ వారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక రకాలైన భారీ పరిశ్రమలు విశాఖకు తరలివచ్చాయి. అప్పట్లో విశాఖలో వనరులు, అభివృద్ధి చూసి.. 1953లో విశాఖను రాజధాని చేయాలని అనుకున్నారట.
ప్రస్తుతం విశాపట్నం జనాభా 30లక్షల వరకు ఉంటుందని అంచనా.. ఏపీలో ఈ స్థాయిలో జనసాంద్రత ఉన్న నగరం ఇదే. ఉమ్మడి విశాఖ జనాభా దాదాపు 60 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. నివాసయోగ్యమైన ప్రాంతం కావడం వల్లే.. విశాఖలో ఇంత మంది జనాభా ఉంటున్నారని, అందుకే దీన్ని రాజధానిగా చేస్తే.. మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వాదన. రాష్ట్ర రాజధాని సమీపంలో పోర్టు అందుబాటులో ఉంటే.. అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. భోగాపురంలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానాశ్రయం కూడా.. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
వలసలు తగ్గే అవకాశం..
ఉత్తరాంధ్ర జనాభా కోటి మందికి పైగా ఉంటారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే వలసలు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల.. అక్కడ ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వలసలను కట్టడి చేయొచ్చనే భావనలో జగన్ ప్రభుత్వం.. విశాఖను పరిపాలన రాజధాని చేసేందుకు ముందుకొచ్చింది.
ఆర్థిక చేయూత..
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం విశాఖ. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తో పోటీగా అభివృద్ధి చెందుతూ వచ్చింది వైజాగ్. రాబోయే కాలంలో వైజాగ్.. ఏపీకి ఉత్తమమైన ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, విద్యాసంస్థలు, పోర్టులు, స్టీల్ ప్లాంట్ తదితర వనరులు ఉన్నాయి. విశాఖను రాజధానిగా చేస్తే.. మరింత వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా ఏపీ ఫైనాన్షియల్ గ్రోత్ లో వైజాగా వాటా మెజార్టీగా ఉండే అవకాశం ఉందని జగన్ సర్కారు భావిస్తోంది.
టూరిజంలో ముందంజ..
ఉమ్మడి రాష్ట్రంలోనే విశాఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఇక రాజధాని అయితే టూరిజం పరంగా ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంది. సినిమా స్టూడియోలు కూడా ఉండడంతో.. సినిమా షూటింగ్ లు మరింత పుంజుకునే అవకాశం ఉంది. విశాఖలో మరికొన్ని స్టూడియోలను నిర్మించేలా.. సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ..
చంద్రబాబు అమరావతి రాజధాని నమూనా చాలా ఖర్చుతో కూడుకున్నది. సరైన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కష్టం. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనాలను కలిగించే విధంగా.. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దవచ్చు.
అమరావతిలో రాజధాని కడితే.. సారవంతమైన భూములను పరిశ్రమలకు ఇవ్వాల్సి వస్తుంది. అదే విశాఖను రాజధాని చేస్తే.. అక్కడ పుష్కలంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. తద్వారా రైతులు తమ భూములను కోల్పోయే పరిస్థితి ఉండదు. అమవరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు ఇలా కనీస సౌకర్యాలను కొత్తగా కల్పించాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయంతో కూడుకున్న పని. అంతేకాకుండా దీనికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. వైజాగ్ లో కొత్తగా నిర్మించకుండా.. ఉన్న వసతులనే విస్తరిస్తే సరిపోతుంది. తద్వారా తక్కువ ఖర్చుతో.. ఎక్కువ ప్రయోజనాలు పొందే ప్రణాళికతోనే జగన్ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
ఇలా అనేక కోణాల్లో ఆలోచించి.. ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రతిపాదించింది. ప్రభుత్వం ప్రతిపాదనను కూడా ఉత్తరాంధ్ర జనం ఆమోదించినట్లు కనిపిస్తోంది. అందుకే విశాఖను రాజధాని చేయాలని పోరు బాట పట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.