
sangam barrage
- సంగం బ్యారేజి జాతికి అంకితం
- ప్రతికూల పరిస్థితులను అధిగమించి సంగం, నెల్లూరు ప్రాజెక్టులు పూర్తి
- మేకపాటి గౌతమ్ రెడ్డి, వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
“వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక నెల్లూరు జిల్లా గురించే ఆలోచించారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశాం. గౌతమ్‌రెడ్డి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు.”
-మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి. కరువు మండలాలు లేకుండా చేసేందుకు ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు జగన్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించారు. అనంతరం మేకపాటి, వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగం బ్యారేజీని జాతికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్యారేజీల నిర్మాణం, రాష్ట్రంలోని సాగు ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడారు.
రూ. 380 కోట్ల వ్యయంతో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసినట్లు వెల్లడించారు జగన్. ఈ బ్యారేజీలతో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆయన మరణం తర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో కమీషన్లు దండు కోవడమే తప్ప.. ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక.. సంగం ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేసినట్లు చెప్పారు. కోవిడ్ సమస్య, వరద సమస్య ఉన్నా ఈ రెండు బ్యారేజీలను మూడేళ్లలో పూర్తి చేశామన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టినట్లు చెప్పారు జగన్. గౌతమ్ సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సంగం ప్రాజెక్టు కింద 3లక్షల 85 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.
జగన్ రుణం తీర్చుకోలేము: రాజమోహన్ రెడ్డి
గౌతమ్ రెడ్డి మరణం తర్వాత తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిదని మేకపాటి రాజమోహన్ అన్నారు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజకీయంగా తమ కుటుంబానికి జగన్ అండగా నిలిచారన్నారు. సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించారని రాజమోహన్ రెడ్డి కొనియాడారు. సంగం బ్యారేజీ అందుబాటులోకి రావడంతో నెల్లూరు ప్రజలు, రైతుల కష్టాలు తీరతాయన్నారు.
ఆత్మకూరుకు నిధులు
ఆత్మకూరు నియోజకవర్గానికి సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ప్రతిపాదనలకు సీఎం జగన్ వేదికపైనే ఆమోదం తెలిపారు. రూ.15 కోట్లతో హైవే నుంచి సంగం బ్యారేజి వరకు రోడ్డు, రూ. 40 కోట్లతో ఇరిగేషన్ పనులు, 25 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు, రూ.12 కోట్లను స్పెషల్ గ్రాంట్‌గా మంజూరు చేశారు జగన్. సంగం పంచాయతీకి రూ. 4 కోట్లు, మొత్తంగా రూ. 85 కోట్ల నిధులను జగన్ కేటాయించారు.