
Vishaka Garjana grand success
విశాఖ తీరాన ఉత్తరాంధ్ర ఆకాంక్ష జనసంద్రమై ఉప్పొంగింది. హోరు వానను సైతం లెక్క చేయక.. వేలాది జనం విశాఖ గర్జనలో పాల్గొన్నారు. తరతరాల వెనుకబాటు మిగిల్చిన ఆవేదనను, విశాఖ రాజధాని పట్ల ఆకాంక్షను గర్జన రూపంలో వెలుగెత్తి చాటారు. విశాఖ రాజధాని విషయంలో ఉత్తరాంధ్రది ఒకే మాట.. ఒకే బాట అని చెప్పకనే చెప్పారు. వెరసి విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయింది. అమరావతే రాజధానిగా ఉండాలంటూ ఉత్తరాంధ్రపై దండెత్తబోతున్నవారికి, వారిని వెనకుండి నడిపిస్తున్నవారికి ఈ గర్జన ఒక కనువిప్పు. ఉత్తరాంధ్ర గడ్డపై రాజుకున్న ఈ వికేంద్రీకరణ ఉద్యమం త్వరలోనే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి.
రెండున్నర గంటల పాటు సాగిన ర్యాలీ
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కావాల్సిన ‘విశాఖ గర్జన’ ర్యాలీ భారీ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. జోరు వాన సైతం ప్రజా హోరు ముందు చిన్నబోయింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ర్యాలీలో విశాఖ రాజధాని కోసం జనం దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ర్యాలీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులంతా ర్యాలీకి తరలివచ్చారు. ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నాక.. అక్కడే బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వికేంద్రీకరణకు మద్దతుగా
చంద్రబాబు, పవన్‌లపై కొడాలి నాని, రోజా ఫైర్ :
విశాఖ గర్జన సభలో మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. విశాఖ రాజధాని కోసం రాజకీయ పోరాటానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ గర్జనతో ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరనేది అమరావతికి వినిపించాలన్నారు. భారీ వర్షంలోనూ ఇంత ర్యాలీ జరిగిందంటే ఉత్తరాంధ్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే.. భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకురావొద్దంటే వికేంద్రీకరణే సరైనదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఉత్తరాంధ్రలో, రాయలసీమలో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఆ ప్రాంతాల్లో రాజధానులు వద్దని చెప్పడమేంటని ప్రశ్నించారు. అమరావతి రియల్ ఎస్టేట్ కోసమే వాళ్ల బాధంతా అని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేనను ఇక్కడి ప్రజలు నిషేధించాలని పిలుపునిచ్చారు. మంత్రి రోజా మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర తొడ కొడితే పవన్ కల్యాణ్ సంగతి ఇక అంతేనన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలది బతుకు పోరాటమైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్లది రియల్ ఎస్టేట్ పోరాటమని అన్నారు.