
VIZAG
ఒకవైపు మూడు రాజధానులు వద్దని అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు విశాఖను రాజధాని చేయాలని ఆ ప్రాంత విద్యార్థులు కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది భూ స్వాముల ఆందోళనలకు తలొగ్గి తమకు అన్యాయం చేయొద్దని ఉత్తరాంధ్ర విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ వేడుకుంటోంది.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో రాజధాని వద్దంటున్న వారికి వ్యతిరేకంగా.. ఉత్తరాంధ్ర విద్యార్థులు కదం తొక్కారు. జేఏసీగా ఏర్పడి.. విశాఖను పరిపాలన రాజధానిగా చేసే వరకు ఉద్యమిస్తామని ప్రతిన బూనారు.
వాస్తవానికి విశాఖ నగరం మినహాయిస్తే ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. రవాణాకు మాత్రమే కాకుండా, పలు రకాలుగా పుష్కలమైన సదుపాయాలున్న విశాఖను ఆర్థిక రాజధానిగా అభివర్ణించడానికి తాను కూడా సంతోషిస్తున్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించి ప్రాంతాభివృద్ధిని కాంక్షించారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశంతో సరిపెట్టుకోకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించి మూడు రాజధానుల అంశాన్ని మరోసారి లేవనెత్తింది వైసీపీ ప్రభుత్వం.
దీంతో అమరావతిలో ఆందోళనలు రగులుతున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చేందుకు విశాఖ విద్యార్థులు నడుంబిగించారు. విశాఖ నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యాన భారీ ర్యాలీని నిర్వహించారు. విశాఖ రాజధాని కాంక్షను గట్టిగా వినిపించారు. ఉత్తరాంధ్రాలో రాజధాని ఉంటే అత్యధిక శాతం బీసీ ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
తమ ప్రాంతానికి రాజధాని రావడం ఇష్టం లేకనే టీడీపీ అమరావతి నుంచి అరసవెల్లి దాకా పాదయాత్రను తలపెట్టిందని ఆరోపణలు గుప్పించారు. ఇది ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యగా భావిస్తున్నామని విద్యార్ధి జేఏసీ ఆరోపించింది. ఉత్తరాంధ్ర ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రజా ప్రతినిధులు ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని లేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు విశాఖను రాజధానిగా చేసేందుకు అనుకూలంగా మారకపోతే ఆయా పార్టీ ఆఫీసుల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అమరావతి రైతుల పాదయాత్రకు విశాఖ సరిహద్దు పాయకరావు పేట వద్దనే బ్రేకులు వేస్తామని స్పష్టం చేశారు.