
ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వై.ఎస్ జగన్
విజయవాడలో కొత్త కోర్టు భవనాలు సిద్ధమయ్యాయి. సిటీ సివిల్ కోర్టు ఆవరణలో వాటిని నూతనంగా నిర్మించారు. ఈ బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం వారంతా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. 2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటి పూర్తికి తొమ్మిదేళ్లు పట్టింది. అప్పుడు శంకుస్థాపన చేసిన ఎన్వీ రమణ ఇప్పుడు ప్రారంభించడం విశేషం. జస్టిస్ రమణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తక్కువ వ్యవధిలో ప్రజలకు న్యాయం అందేలా న్యాయవాదులు పనిచేయాలన్నారు. విభజనతో వెనుకబడిన ఏపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన రెండేళ్ల పదవీ కాలంలో 250 మంది హైకోర్టు న్యాయ మూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. రూ. 55 కోట్ల అంచనాతో మొదలైన కోర్టు భవనాల ఖర్చు రూ. 100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వం సహకారంతో పనులు పూర్తి చేశామని వివరించారు. విశాఖలో కూడా పెండింగ్లో ఉన్న భవనం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సహకారం అందించాలని కోరారు. జ్యూడీషియరీకి సంబంధించి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధమని సీఎం జగన్ తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం కావడం గుర్తుండిపోయే ఘట్టమన్నారు.