
తాజాగా పండుతున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో, వైయస్ విజయమ్మ ఒక హృదయపూర్వక బహిరంగ లేఖ విడుదల చేసి, తన భర్త వైయస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విన్నవిస్తూ విజయమ్మ, తన కుటుంబంపై జరుగుతున్న వివాదాలు మరియు పెచ్చుమీరిన ఊహాగానాలపై తన బాధను వ్యక్తం చేశారు.
తన కుటుంబం గురించి విజయమ్మ గుర్తు చేస్తూ, “వైయస్సార్ ఎప్పుడూ కుటుంబ సమైక్యతను ఎంతో ముఖ్యంగా భావించేవారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమస్యలను నివారించడానికి ఎంత ప్రయత్నించినా, కొన్ని వర్గాలు అబద్ధాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. దయచేసి, ముఖ్యంగా సోషల్ మీడియాలో మన ఇష్టానుసారం వాదనలు చేయకుండా, మా కుటుంబాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాను” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి ప్రముఖులు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పష్టతనిచ్చారు. “వైయస్సార్ బ్రతికుండగానే ఆస్తులు పంచారని చేసిన ఆరోపణలు అబద్ధం. నా పిల్లల భద్రత కోసమే కొన్ని ఆస్తులను శర్మిల, జగన్ పేర్లపై రాశారు కానీ పంచడం కాదు. ఈ అంశంపై తమ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు కూడా తప్పుగా మాట్లాడడం తగదు,” అని వివరించారు.
2009లో వైయస్సార్ మరణం తరువాత, 2019 వరకు కుటుంబ సభ్యులు ఒకటిగా ఉన్నారని, ఆ తర్వాత జగన్ ఆస్తులను విభజించాలనే ప్రతిపాదన చేసినట్లు ఆమె వివరించారు. “ఇది ఒక సహజ నిర్ణయం, పిల్లలు పెద్దవాళ్లయ్యారని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి మాత్రమే తీసుకున్న చర్య,” అని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎంఓయూ కుదుర్చుకోవడం ఒక వ్యహార రీతి మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
తాజా వివాదాలపై మాట్లాడుతూ, తన కుమార్తె శర్మిలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక తల్లిగా తట్టుకోలేకపోతున్నానని విజయమ్మ వెల్లడించారు. “శర్మిల, జగన్ రాజకీయ జీవనంలో ఎంతో నిస్వార్థంగా సహకరించిందని కానీ ఆమెను వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామ్యం చేయకపోవడం బాధకరం,” అన్నారు.
తన పక్షపాతం కారణంగా కాకుండా వాస్తవాలు ప్రజలకు తెలియాలన్న కోరికతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని విజయమ్మ తెలిపారు. ఈ అంశంపై సామరస్యంగా తమ పిల్లలు పరిష్కారం చేసుకోవాలని, తమ కుటుంబంలో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వైయస్ విజయమ్మ సందేశం:
“మా కుటుంబం పట్ల ప్రేమను చూపిన ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ కొడుకులా, కూతురిగా మీ అందరి కోసం ఒకే విజ్ఞప్తి, దయచేసి ఈ వివాదంలో ఊహాగానాలను ఆపండి. వైయస్సార్ గారి స్మృతిని గౌరవిస్తూ శాంతి, అవగాహనతో మెలగాలని మనవిచేస్తున్నాను.”
ఈ లేఖతో వైయస్సార్ కుటుంబంపై జరుగుతున్న చర్చలకు ఎటువంటి మార్పు సంభవిస్తుందో వేచి చూడాలి.