
104 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గంథాలయం గుర్తింపు పొందింది. 1918 అక్టోబర్ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ భావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శ్రేష్టి ప్రోత్సాహంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్ 18న మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది.
రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాలను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటాలుగా భద్రపరచడం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు, సాహిత్య పరిశోధకులకు బాగా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విషయ సేకరణ చేస్తుంటారు.