
రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాసేవను మరింత విస్తరించే దిశగా మోడరన్ లుక్‌తో డిజైన్ చేసిన భవనం రాష్ట్రానికే ప్రేరణగా నిలవనుంది. భవన నిర్మాణం అత్యాధునికంగా తీర్చిదిద్దారని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు.
కడప-పులివెందుల మెయిన్ రోడ్‌పై నిర్మించిన సచివాలయ భవన అంచనా వ్యయం రూ.3.22 కోట్లు. రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పోస్టాఫీస్, కోఆపరేటివ్ సొసైటీ, ప్రత్యేక బస్టాండ్ వంటి ప్రధాన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి:
రాష్ట్ర చరిత్రలోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో లేని డిజిటల్ లైబ్రరీని వేల్పుల గ్రామంలో నిర్మించారు. దాంతో పాటుగా గ్రామంలో అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడం కూడా రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా గ్రామంలోని సచివాలయాన్ని ప్రారంభించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్.
షెడ్యూల్ ప్రకారం.. హెలికాప్టర్లో కార్యక్రమానికి హాజరుకావాల్సిన సీఎం వాతావరణం అనుకూలించకపోవడం రోడ్ మార్గానే భవనానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 1న కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసి నాయకులను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
నిర్మాణ వ్యయం:
గ్రామ సచివాలయ భవనాన్ని రూ.40 లక్షలతో, రైతు భరోసా కేంద్రం (రూ. 21.80 లక్షలు), డిజిటల్ లైబ్రరీ (రూ. 16 లక్షలు), వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూ. 19.50 లక్షలు), పోస్టాఫీసు (రూ. 17 లక్షలు), బేసిక్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ భవనాన్ని రూ. 40 లక్షలతో నిర్మించారు. వీటితో పాటుగా గ్రామంలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్, రూ.13 లక్షలతో నిర్మించిన వెయిటింగ్ హాల్, రూ.16.50 లక్షలతో నిర్మించిన ఓపెన్ స్టేజీ, ఓవర్ హెడ్ ట్యాంక్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం రూ.3 లక్షలతో పూర్తి చేశారు.
అనంతరం, సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
ముఖ్యుల సమక్షంలో:
ప్రతి కార్యాలయ భవనంలోని ఫర్నీచర్, ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, వేముల జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఉషారాణి, సర్పంచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.