
కార్డు స్వైపింగులూ పెరిగాయి | నగదు కన్నా డిజిటల్ మిన్న
షాపింగ్‌కు వెళ్లినా, లంచ్ చేసినా, చాయ్ తాగినా, మూవీకి వెళ్లాలన్నా.. పని ఏదైనా కార్డుతో, యూపీఐ స్కానింగుతో పే చేసేస్తున్నారు. మన దేశంలో 2013లో డిజిటల్ పేమెంట్ విధానం మొదలైంది. మొదట్లో ఏటీఎం మెషీన్ నుంచి కార్డుతో డబ్బులు డ్రా చేసి నగదు చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు టీ తాగినా, పెట్రోల్ కొట్టించినా స్కానింగ్ చేసేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ, ఏపీ నంబర్ వన్‌గా ఉన్నట్లు ఈ- తాల్ 2014-22 జనవరి వరకు జరిగిన లావాదేవీలపై విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది.
2014 జూన్ నుంచి 2022 జనవరి వరకు దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభా చేసిన లావాదేవీల్లో తెలంగాణ, ఏపీ టాప్‌లో ఉన్నాయి. తెలంగాణలో అత్యధికంగా ప్రతి వెయ్యి మంది లక్షా 38 వేల 266 ట్రాన్సాక్షన్లు చేస్తే.. ఏపీలో లక్షా 37 వేల 264 లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఉంది. ఏపీలో గ్రామ స్థాయి వరకు ఈ పేమెంట్లు చేరాయి. యూపీఐ సంస్థలు ప్రతి వ్యాపార దుకాణంలో స్కానింగ్ ప్యాడ్లు పెట్టించడంతోపాటు ఆఫర్లు ఇస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా నగదును బ్యాంకుకు వెళ్లి జమ చేసుకోవాల్సిన అవసరాన్నీ ఈ పేమెంట్లు తీరుస్తున్నాయి. లావాదేవీ జరిగిన వెంటనే బ్యాంకు సమయాలు, సెలవులతో సంబంధం లేకుండా నగదు జమ అవ్వడం వారికి కలిసొస్తోంది. దీంతో పల్లెటూర్లలోనూ చిన్నచిన్న అవసరాలకూ స్కానింగ్ చేస్తూ చెల్లింపులు జరపడం కనిపిస్తోంది.