
TTD
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు పేర్కన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వారి కోసం.. తిరుమలలోని ఉద్యానవనాలను రూ.60 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు.
బ్రహ్మోత్సవాల కోసం కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వీవీఐపీలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేశారు. 27న సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమల పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఏడాది ఆఖరి కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. 2023 కొత్త ఏడాది నాటికి వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. శ్రీనివాస సేతుతో తిరుపతి స్థానికులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.