
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ బి.ఆర్. నాయుడు జనవరి 8న జరిగిన తొక్కిసలాట పై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టెలా ఉన్నాయి. తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు మరణించగా, అనేక మంది గాయపడిన ఘటనపై క్షమాపణలు చెప్పడం చనిపోయినవారిని తిరిగి తీసుకురావడంలో సహాయపడదని నాయుడు వ్యాఖ్యానించారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొక్కిసలాట బాధితుల కోసం క్షమాపణలు చెప్పాలని సూచించడంపై బి.ఆర్. నాయుడు స్పందించారు. “క్షమాపణలు చెప్పడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ, క్షమాపణలు చెప్పడం వల్ల చనిపోయినవారు తిరిగిరారు . ఎవరు ఏమంటారో దానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు,” అని నాయుడు మీడియాతో అన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టిటిడి బోర్డు సభ్యులు దోషులుకాదని స్పష్టం చేసిన నాయుడు, “మేము భక్తులకు క్షమాపణలు చెబుతున్నాము,” అని తెలిపారు.
నాయుడు ఈ ఘటనలో తప్పు జరిగినదని అంగీకరించారు. “దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు బాధ్యులో తెలియజేస్తారు. దోషులపై చర్యలు తీసుకుంటారు,” అని తేలిపారు .
మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తిరుపతిని సందర్శించినప్పుడు టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, బోర్డు సభ్యులు, కార్యనిర్వాహక అధికారి జె. శ్యామల రావు, అదనపు కార్యనిర్వాహక అధికారిని బాధితుల ముందు క్షమాపణలు చెప్పాలని సూచించారు.
తన అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురంలో ఒక సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, “మీరంతా బాధితుల కష్టాలు వినాలి. నేరుగా ప్రజల ముందు క్షమాపణలు చెప్పి, ఈ ఘటనకు బాధ్యత వహించాలి,” అని పిలుపునిచ్చారు.
“ఈ తొక్కిసలాట బాధ్యత ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరిది. నాకు ఎటువంటి తప్పు లేకపోయినా, నేను ప్రజలకు క్షమాపణలు చెప్పాను. ఇదొక సమిష్టి బాధ్యత,” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.టిటిడి అధికారులు ఈ ఘటనను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.