
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ నిలయంలో హెచ్ఆర్ డైరెక్టర్ లింగమూర్తికి మెమొరాండం అందజేసి, విద్యుత్ చార్జీల తగ్గింపుపై ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు 15,500 కోట్ల రూపాయల భారం మోపిందని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేయడం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన నిర్వహించడం ద్వారా ప్రజల పక్షాన వైసీపీ నిలుస్తుందనే విషయం స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, తల్లికి వందనం, మహిళలకు రూ. 1500, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి హామీలపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినాష్ వ్యాఖ్యానిస్తూ, కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మోసగించలేరని , జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజల కోసం నిలబడుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలమైన ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనతో ప్రజలను విసిగించిందని, రాబోయే ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.