
సాంకేతికత ఆధారంగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు పటిష్ఠ ప్రణాళికలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు సాంకేతికత కీలకమని ఆయన శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్/గవర్నమెంట్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2024లో వ్యాఖ్యానించారు.
ఈ సదస్సును గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫార్మేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఏఎంటీజడ్, ఎఏఐజీ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమం భవిష్యత్ సాంకేతికతను ప్రభుత్వానికి అన్వయింపజేసి అభివృద్ధి, ఆరోగ్యం, ఎంఎస్ఎంఈల వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లక్ష్యంగా రూపొందించబడింది.
సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, డీప్ టెక్ యొక్క పాత్ర అనివార్యం అని, ఇది భవిష్యత్తు ఉపాధి అవకాశాలకు ప్రధాన మార్గం అవుతుందని చెప్పారు. సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చి 15% వృద్ధి రేటును సాధించి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు,2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన కోసం ఆయన పేదరిక నిర్మూలన, ఉపాధి సృష్టి, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్, ఇంధన రంగ అభివృద్ధి, డీప్ టెక్ వృద్ధి వంటి 10 ముఖ్య సిద్ధాంతాలను వివరించారు.
గతంలో విద్యుత్ రంగ సంస్కరణలను మొదటగా చేపట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను హైడ్రోజన్ ఇంధనం మరియు గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.