
tidco housing scheme soon another 20 176 tidco houses will be distributed to beneficiaries
జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా పోగేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతింటి నిర్మాణమనేది పేదలకు ఒక తీరని కల. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకైతే అది కనీసం ఊహించలేనిది. గూడు లేని ఈ పేదల గోడును సీఎం జగన్ పట్టించుకున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను ఆయన నిజం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేలాదిమంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ జరిగింది. తాజాగా కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన 2720 యూనిట్లను మంత్రి ఆదిమూలపు సురేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. త్వరలోనే మరికొన్ని పట్టణాల్లో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ షురూ కానుంది.
20 వేల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం
మంగళగిరిలో ఈ నెల 15న, జీవీఎంసీ పరిధిలో ఈ నెల 21న టిడ్కో ఇళ్ల పంపిణీ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 9 పట్టణాల్లో 20,176 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో విజయనగరంలో టిడ్కో ఇళ్ల పంపిణీని ప్రారంభించిన నాటి నుంచి సెప్టెంబర్ వరకు 44,320 యూనిట్లను పంపిణీ చేశారు. ఇందులో 39,820 యూనిట్లు ఆగస్టులో పంపిణీ చేయగా 4500 యూనిట్లు సెప్టెంబర్‌లో పంపిణీ చేశారు. వర్షాల కారణంగా ఇళ్ల పంపిణీకి తాత్కాలిక బ్రేక్ పడినప్పటికీ.. ఆ తర్వాత అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు.
ఇప్పటివరకూ జరిగిన ఇళ్ల పంపిణీ వివరాలు
నెల్లూరు పరిధిలో 4800, విజయనగరం పరిధిలో 2656, తాడేపల్లి పరిధిలో 2272, పెద్దాపురం పరిధిలో 1728, సామర్ల కోట పరిధిలో 1056, రాజమండ్రి పరిధిలో 3424, గూడూరు పరిధిలో 5120, ఆత్మకూరు పరిధిలో 1056, కర్నూలు పరిధిలో 6000, భీమవరం పరిధిలో 8352 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
టీడీపీ ప్రభుత్వానికి, జగన్ సర్కార్‌కి ఇదీ తేడా :
టీడీపీ పాలనలో టిడ్కో ఇళ్ల పథకాన్ని ఆ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆ ఇళ్లకు రూ.2.60 లక్షల చొప్పున ధర నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి ప్రతీ నెలా రూ.3 వేలు చెల్లించాలన్నారు. ఇది పేదలకు తలకుమించిన భారం. ప్రస్తుత వైసీపీ సర్కార్ టిడ్కో హౌసింగ్ స్కీమ్ కింద మొత్తం 2.62 లక్షల ఇళ్లు నిర్మించింది. ఇందులో 300 చదరపు అడగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయికే ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం 355 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,18,616 ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులందరికీ మేలు చేసేలా ప్రభుత్వమే ఈ ఇళ్లను ఉచితంగా వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1000 కోట్ల భారం పడుతోంది.