
Chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకున్నందున ఆయనపై దర్యాప్తునకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ పై విచారించిన జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది ధర్మాసనం.. ఈ విషయంతో మీకు ఏంటి సంబంధం అని లక్ష్మీపార్వతి ప్రశ్నించింది. అయితే తాను ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్యనని లక్ష్మీపార్వతి చెప్పగా.. ఆ సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో పిటిషన్ కొట్టి వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
అయితే ఇదే విషయంపై లక్ష్మీపార్వతి దాఖలుచేసిన కేసును ఏసీబీ న్యాయస్థానం 2021 మేలో కొట్టేసింది. దానిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ ను కోర్టు తొసిపుచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. లక్ష్మీపార్వతి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని పేర్కొన్న సుప్రీంకోర్టు కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
వాదనలు ఇలా జరిగాయి..
లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్ 156(3) ప్రకారం చంద్రబాబుపై ఆరోపణలపై దర్యాప్తు కోరుతున్నట్లు చెప్పారు. జస్టిస్ దినేష్ మహేశ్వరి జోక్యం చేసుకొని.. అందుకు మీరెవరని అడిగారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సమాధానం చెప్పారు. లక్ష్మీపార్వతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్లో ఒకరితోపాటు మాజీ ముఖ్యమంత్రి సతీమణిని అని ధర్మాసనానికి వివరించారు. ‘కేసును విచారణ చేపట్టడానికి ఇదేమైనా అర్హతా’ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆస్తుల కొనుగోల విషయంలో ప్రతివాది కుటుంబసభ్యులు చెప్పిన లెక్కలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదని నాగేశ్వరరావు ధర్మాసనానికి వివరించారు. వారు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వాటిపై విచారణకు అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు చేయించాలని కోరారు. ఆ వాదనలతో ఏకీభవించని జస్టిస్ దినేష్ మహేశ్వరి కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.