
Suicide
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్ల ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్వహరించిన ఎస్సై సత్యనారాయణపై వేటు వేసింది.
వైసీపీ నాయకత్వం కూడా దీనిపై స్పందించింది. మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని.. చర్యలు చేపట్టామన్నారు. పోలీసుల అసమర్థతను పార్టీ సహించేది లేదన్నారు. తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు పూర్తి బాధ్యులైన ఎస్ఐ సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు పార్టీ బాధ్యులు వెల్లడించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసమే దిశా చట్టం తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
పెదవేగి మండలం వేగివాడకు చెందిన బాలికకు దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులు చేసే చిట్టిబాబుతో పరిచయం ఏర్పడింది. చిట్టిబాబు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై ఏలూరు తీసుకెళ్లాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 13వ తేదీ సాయంత్రం బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.
బాలిక చిట్టిబాబు బైక్ ఎక్కి వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. నిందితుడి వేధింపులతో భయపడిపోయిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై బాలిక బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికకు లైంగిక వేధింపులపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేయకపోగా ఎస్ సత్యనారాయణ వారితో అవమానకరంగా మాట్లాడినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తమకు అన్యాయం జరిగిందని, ఎస్ఐ సైతం దూషించారని తీవ్ర మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు ఈనెల 16వ తేదీన కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినా వారి ప్రాణాలు దక్కలేదు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బాలిక మృతి చెందగా.. శనివారం ఉదయం ఆమె తల్లి చనిపోయింది.