
Visakha garjana
- ఈ నెల 15న జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ
- పాల్గొననున్న వైసీపీ నేతలు, ప్రజాసంఘాలు, మేధావులు
మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర కదం తొక్కుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ఊరూవాడా ఉద్యమబాట పట్టాయి. విశాఖ రాజధాని అంశం.. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షగా మారింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను బలంగా చాటేందుకు అక్టోబర్ 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది జేఏసీ. దీనికి అధికార వైఎస్సార్సీపీ సహా పలు ప్రజాసంఘాలు, మేధావులు కూడా మద్దతు తెలిపారు.
సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన రోజు ఉత్తరాంధ్ర ప్రజలు.. సంతోషంలో పొంగిపోయారు. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర.. జగన్ నిర్ణయంతో బాగు పడుతుందని ఆశ పడ్డారు. అయితే ప్రతిపక్షం అడ్డుపడటంతో.. ఆ ప్రాంత ప్రజలు మళ్లీ నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం జగన్ మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో.. మళ్లీ ఆ ప్రాంత ప్రజల ఆశలు చిగురించాయి. ఈసారి ఉత్తరాంధ్రకు వరంగా మారిన విశాఖ రాజధానని పోగొట్టుకోవద్దని దృఢ సంకల్పంతో ప్రజలే నేరుగా పోరు బాట పట్టారు.
విశాఖ రాజధానిగా ఉండాలనే కోరికను ప్రపంచానికి చాటేందుకు ‘విశాఖ గర్జన’ను వేదికగా చేసుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకు అనుకూలంగా జేఏసీ సైతం ఏర్పాట్లు చేస్తోంది.
అండగా వైసీపీ..
విశాఖను రాజధానిగా చేసేందుకు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలను సంఘటితం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మంత్రులు బొత్స, ధర్మానతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. విశాఖను రాజధాని చేసేందుకు.. రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. ఈ నెల 15న జరగనున్న విశాఖ గర్జనకు సైతం మద్దతు తెలిపి.. విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
15న షెడ్యూల్ ఇదే..
15వ తేదీన డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయి. విశాఖ గర్జనలలో భాగంగా నిర్వహించే ర్యాలీలో భారీగా ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొననున్నారు.
టీడీపీపై ఆగ్రహం?
విశాఖను రాజధానిగా చేయొద్దని టీడీపీ వాదిస్తోంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రను టీడీపీ ముందుండి నడిపిస్తోంది. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్న టీడీపీపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీ అభివృద్ధి చేయదు.. జగన్ చేస్తుంటే అడ్డుకుంటుంది’ అంటూ.. ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా.. అమరావతి రైతులపై ప్రేమను ఎలా కనబరుస్తారంటూ స్థానిక టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.