
VisakhaGarjana
విశాఖ తీరం గర్జించింది. వైజాగ్ ను రాజధాని చేయాల్సిందేని గొంతెత్తి చాటింది. రాజధాని ఆకాంక్షను చాటేందుకు ఉత్తరాంధ్ర ఊరు వాడా కదిలింది. నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు జనం పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. తమ ఆకాంక్షను చాటేందుకు.. వేలాదిగా తరలి వచ్చారు. విశాఖ రాజధాని నినాదాలు, సంప్రదాయ నృత్యాలతో విశాఖ తీరం హోరెత్తింది.
వికేంద్రీకరణే లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఉత్తరాంధ్ర ప్రజలు అడుగడుగునా ఉత్తరాంధ్ర ప్రజలు హారతి పట్టారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదించారు.
వర్షాన్నిసైతం లెక్క చేయకుండా లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ర్యాలీకి విశాఖ సంఘీభావం తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని అంటూ నినాదాలతో హోరెత్తించారు. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ఎగులెత్తి చాటారు. అమరావతి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు అంటూ ఉత్తారంధ్ర ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరించారు.
జేఏసీ నిర్వహించిన ర్యాలీకి వైసీపీ కూడా మద్దతు తెలిపింది. ర్యాలీలో మంత్రులు రోజా, అమర్ నాథ్, బొత్స, మాజీ మంత్రి కొడాలి నాని, స్పీకర్ తమ్మినేని తదితర నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని అని కొడాలి నాని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయమని వివరించారు. ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలని విమర్శించారు.