
ఉద్యోగానికి రాజీనామా చేసినా, తొలగించినా ఫైనల్ సెటిల్మెంట్ త్వరగా పూర్తి చేయాలని కొత్త వేతన చట్టం నిర్దేశిస్తోంది. దీంతో మానేసిన ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కంపెనీలు చివరి పని దినం నుంచి రెండు రోజుల్లో ఫుల్, ఫైనల్ సెటిల్మెంట్ తప్పనిసరిగా పూర్తిచేయాలని నూతన వేతన చట్టం స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు 45 – 90 రోజుల్లో ఫైనల్ సెటిల్మెంట్ పూర్తవుతోంది. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన లేబర్ చట్టాల్లో ఈ అంశం కూడా ఉంది. అయితే గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
అయితే ఈ చట్టాలను పలు రాష్ట్రాలు ఇంకా ఆమోదించలేదు. రాజ్యాంగం ప్రకారం కార్మిక అంశాలు ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కనుక వీటికి రాష్ట్రాల ఆమోదం ఉండాల్సిందే. ఇంతవరకు కేవలం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నూతన వేతన చట్టాన్ని రాటిఫై చేశాయి. అయితే రాష్ట్రాలు తమకు అనుకూలంగా చట్టంలో ఫైనల్ సెటిల్మెంట్ గడువును మార్చుకునే వీలుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కంపెనీలో తమ వేతన చెల్లింపు విధానాలను మార్చుకోవాల్సి వస్తుంది. కొత్త చట్టాల ప్రకారం కంపెనీలో పని గంటలను రోజుకి ఎనిమిది లేదా తొమ్మిది గంటల నుంచి 12 గంటలకు పెంచుకోవచ్చు. అలా పెంచుకుంటే వారానికి మూడు రోజులు ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగి వారానికి ఎప్పటిలాగే నలభై ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగి చేతికి వచ్చే వేతనంలో కూడా కొత్త చట్టం వల్ల మార్పులు వస్తాయి. ఉద్యోగి మంత్లీ గ్రాస్ శాలరీలో 50 శాతం బేసిక్ సాలరీగా ఉండాలి. ఉద్యోగి, యజమాని నెలనెలా చెల్లించే ప్రావిడెంట్ ఫండ్ మొత్తం కూడా కొత్త చట్టం ప్రకారం పెరుగుతుంది.