
Ap ministers
ఓపీఎస్ అమలు సాధ్యం కాదని, సీపీఎస్ కంటే మెరుగైన పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పించడం కోసం జీపీఎస్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు. జీపీఎస్ లో మరిన్ని సదుపాయాలను చేరుస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రులు ఆర్థిక శాఖ, జీఏడీ అధికారులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చింది. జీపీఎస్ విధానంలో హామీ పింఛను, హామీ కనీస పింఛను–ఆరోగ్య భద్రత, హామీ కుటుంబ భద్రత, ప్రమాదవశాత్తు మరణం–వైకల్య బీమా సౌకర్యాన్ని చట్టపరంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఫైనాన్షియల్ మినిష్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. జీపీఎస్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమోదాన్ని తెలియజేయొచ్చని సూచించారు.
కనీసం రూ.10వేలు వచ్చేలా..
ఉద్యోగులతో జీపీఎస్‌పై చర్చించామని, తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత చట్టబద్ధత కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రిటైర్ అయ్యాక కచ్చితంగా కనీసం రూ.10 వేలు పెన్షన్ ఉండేలా మార్పులు చేసినట్లు వెల్లడించారు. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ వస్తుందని, హెల్త్ కార్డులు కూడా ఉంటాయని తెలిపారు. ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సీఎంతో చర్చిస్తామన్నారు. గురుకులాలు, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలని.. ఉద్యోగులపై ప్రేమ ఉండబట్టే వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేలా జీపీఎస్ తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా బెస్ట్ ప్యాకేజీగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయడమంటే రాష్ట్రానికి విపత్తు సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. జీపీఎస్ రూపకల్పన చర్చల్లో సీఎం జగన్ నేరుగా పాల్గొని సూచనలు, సవరణలు చేశారని తెలిపారు. జీపీఎస్ కూడా భారమని ఆర్థిక నిపుణులు చెప్పినా, ఉద్యోగులకు కనీస భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని భావించినట్లు చెప్పారు.