
దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందుతున్న భారతీయ జనతా పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. 2019 ఎన్నికల తర్వాత మాత్రం తెలంగాణలో తమకు మెరుగైన అవకాశాలు ఉన్నాయనుకున్న కాషాయ దళం.. అక్కడ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీలోని కీలక నేతలు, కేంద్ర మంత్రులు తరుచూ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తుండటం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు వరుసపెట్టి ఏపీకి వస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, కిషన్ రెడ్డి తదితరులు పర్యటించారు. పార్టీ నాయకులతో సమావేశమై కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఇటీవల పర్యటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కేంద్ర మంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి.. ఈ మధ్య తరుచూ ఏపీకి వస్తున్నారు. ఇలా పెద్ద నాయకులు వరుసగా వస్తుండటం శ్రేణులు నూతనోత్తంతో పనిచేస్తున్నారట. అందుకే కనీసం వారానికి ఒక పెద్ద నాయకుడైనా రాష్ట్రంలో పర్యటించేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రవాస్ యోజనలో భాగంగా సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కేంద్ర మంత్రి నారాయణ స్వామి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి భారతీ పవార్ ఈనెల 10వ తేదీ నుంచి12వ తేదీ వరకు పర్యటించనున్నారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ మంత్రులు పర్యటిస్తారు.
మంత్రుల పర్యటన ఏవిధంగా ఉండాలన్న అంశాలపై రాష్ట్ర ప్రవాస్ యోజన కమిటీ ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి, కార్యకర్తలకు పర్యటన వివరాల సమాచారం అందించారు. కేంద్ర మంత్రులు పర్యటనలో భాగంగా పార్టీ సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మండల స్ధాయిలో పార్టీ యోజన ఏవిధంగా ఉంది అనే అంశాలు సమీక్ష నిర్వహించనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగానే కేంద్ర మంత్రులు పర్యటనలు ఉండనున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటన చేస్తారు. ఈనెల 11,12 తేదీల్లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించే పాల్గొననున్నారు.
అయితే భారతీ పవార్ ఇప్పటికే విజయవాడ పార్లమెంటు పరిధిలో పర్యటన పూర్తి చేయగా, నారాయణ స్వామి నరసాపురం పార్లమెంట్ పరిధిలో పర్యటన పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారు.