
భారీ అంచనాలతో ఆగస్టు 25 న విడుదలైన లైగర్ ‘ లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా 2022లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. భారీ నష్టాలను చవి చూస్తోంది. ఈ వారమే థియేటర్ల నుంచే వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని భాషల్లో కలిపి రోజుకు కోటి రూపాయలు మాత్రమే ఈ సినిమా వసూళ్లను రాబడుతోంది. ఏడో రోజైతే దారుణంగా రూ.90 లక్షలు వసూలు కావడం.. సినిమా దుస్థితికి అద్దం పడుతోంది.
వాస్తవానికి సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. తొలిరోజు రూ. 35కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అయితే ఆ తర్వాత మౌత్ టాక్ సరిగా లేకపోవడం.. విశ్లేషకులను సైతం సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాత రోజు నుంచి సినిమా కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఇక రాను రాను సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
పూరీ, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం విజయ్, పూరీ మూడేళ్లు కష్టపడ్డారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటించారు. విజయ్, అనన్య దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ చిత్రాన్ని ప్రమోట్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. రూ. 90 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా చివరికి ప్రేక్షకుల నిరాదరణకు గురైంది.