
Minister Karumuri Venkata Nageswara Rao
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పథకానికి కేరళ ప్రతినిధి బృందం ఫిదా అయ్యింది. అలాగే ఏపీ ప్రభుత్వంతో పలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపింది. సోమవారం కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో సోమవారం కేరళ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ జి. ఆర్. అనిల్, ఆ రాష్ట్ర అధికారులతో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు సమావేశమయ్యారు. అనంతరం సమావేశం వివరాలను వివరించారు మంత్రి కారుమూరి.
కేరళ రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ టన్నులు ఎంటీయూ 3626 (బొండాలు) జయ వెరైటీ బియ్యాన్ని సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం కోరుతున్నదని ఇందుకు సంబంధించి రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల జయ వెరైటీ బియ్యం తో పాటు కందిపప్పు, పెసలు, మినుములు, ఎండు మిర్చి మొదలగు వాటిని కూడా కేరళ రాష్ట్రం కొనుగోలు చేస్తున్నదని ఇందుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేశారన్నారు. కేరళ ప్రభుత్వం మిరప నెలకు 550 టన్నులు అవసరం అవుతుందని తెలియజేసిందన్నారు. కేరళ వినియోగదారుల డిమాండ్ ను తీర్చడానికి జయ బియ్యం, ఎండు మిర్చి సరఫరా కొరకు పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేరళ బృందం ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు.
ప్రతీ నెల 4500 టన్నుల జయ బియ్యం, 550 టన్నుల ఎండు మిర్చి అవసరం ఉంటుందని కేరళ ప్రతినిధి బృందం తెలియజేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశ పెట్టిన మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ (ఎండీయూ ) ద్వారా ఇంటింటికీ రేషన్ పథకం అమలు పరిశీలించిన కేరళ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన విషయాలన్నింటిపై ఈనెల 27వ తేదీన కేరళ లో క్షేత్ర స్థాయిలో రెండు ప్రభుత్వాల ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ. 30 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించమని ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని తెలిపారు. 2017వ సంవత్సరం నుంచి ఈ స్కాం జరుగుతున్నదని ఆడిట్ నిర్వహించి ప్రాధమిక నిర్దారణకు వచ్చామన్నారు. ఇందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిపై పూర్తి స్థాయి విచారణకు సి ఐ డి ఎంక్వయిరీ చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని కోరనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సకాలంలో ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుకు చెల్లించవలసిన సొమ్ము ఎటువంటి పెండింగ్ లేదని మంత్రి నాగేశ్వర రావు అన్నారు.