
ఆంధ్రప్రదేశ్ లో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ లేఖ ద్వారా వివరించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం- కోదాడ గ్రామాల పరిధిలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
బల్క్‌డ్రగ్ పార్కుల ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది. కేంద్ర స్టీరింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై 7రోజుల్లోగా అంగీకారం తెలపాలని ఆ లేఖలో వివరించారు ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్. బల్క్‌డ్రగ్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాయితీలు, ప్రోత్సాహకాల వివరాలను ఆ లేఖకు జతచేశారు.
వాస్తవానికి బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదలను కొరింది కేంద్రం. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందకుు తెలంగాణ, తమిళనాడు తీవ్రంగా ప్రయత్నించగా.. చివరికి అది ఏపీని వరించింది.