
YSRCP-TDP
- పనులు తమ హయాంలో జరిగియంటూ.. ఇరు పార్టీల పరస్పర వాదన
నెల్లూరు జిల్లా రైతుల వరప్రదాయినులైన సంగం, నెల్లూరు బ్యారేజీలను మంగళవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులపై రాజకీయ రగడ రాజుకుంటోంది. ప్రాజెక్టుల క్రెడిట్ తమకు దక్కుతుందంటే.. కాదు కాదు తమకే దక్కుతుందంటూ వైసీసీ- టీడీపీ వాదిస్తున్నాయి.
సుమారు 140 ఏళ్ల క్రితం సంగం ఆనకట్ట, నెల్లూరు ఆనకట్టలను బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఈ రెండు ఆనకట్టల కింద దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలక్రమంలో ఈ ఆనకట్టలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పునర్నిర్మాణం అనివార్యమైంది. ఈ క్రమంలో 2000లో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రకు దిగొచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం సంగం బ్యారేజి నిర్మాణానికి అనుతులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత చాలా కాలం వరకు పనులు మొదలు కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా 2006లో సంగం ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. 2008లో నెల్లూరు బ్యారేజికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ నిధులు కూడా కేటాయించారు. అయితే వైఎస్సార్ చనిపోయాక పనులు కాస్త మందగించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. చంద్రబాబు సీఎం అయ్యాక.. కొంత పనులు జరిగాయి. జగన్ సీఎం అయ్యాక మిగిలిన పనులను పూర్తి చేసి రెండు బ్యారేజీలను ఒకేసారి ప్రారంభించారు. వైఎస్సార్ హయాంలో మొదలై.. చంద్రబాబు పాలనలో కొనసాగి.. జగన్ జమానాలో పూర్తయిన ఈ బ్యారేజీల క్రెడిట్ కోసం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.
వైసీపీ ఏం అన్నదంటే..
వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ఈ బ్యారేజీలు జగన్ పాలనలో పూర్తయ్యాయని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ట్వీట్ చేశారు. ’తండ్రి మొదలు పెట్టాడు.. కుమారుడు పూర్తి చేశాడం‘టూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఎన్నో దశాబ్దాల నెల్లూరు వాసుల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసినట్లు నాయకులు చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. సంగం బ్యారేజీ కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి సంగం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు నాయకులు చెబుతున్నారు.
నెల్లూరు బ్యారేజి కోసం వైఎస్సార్ రూ.147 కోట్లుగా అంచనా వేసి.. రూ.86 కోట్లు ఖర్చు చేశారని వైసీపీ నాయకులు వాదిస్త్తున్నారు. వైఎస్సార్ చనిపోయాక ఆగినపోయిన పనులపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, వైసీపీ సర్కారు వచ్చాక మిగిలిన నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన సీఎం జగన్ బ్యారేజిని పూర్తి చేసినట్లు ట్వీట్లు చేశారు నాయకులు.
టీడీపీ వాదన ఇదీ..
వైసీపీ చెబుతున్న మాటలను టీడీపీ వ్యతిరేకిస్తోంది. ‘పని మనది – ప్రచారం తనది. మూడేళ్ళలో 10శాతం నెల్లూరు బ్యారేజ్ పనులు, 15శాతం సంగం బ్యారేజ్ పనులు కూడా సరిగా పూర్తి చేయలేని అసమర్థ సీఎం రిబ్బన్ కటింగ్ అంటే మాత్రం ముందుంటాడు.’ అని టీడీపీ ట్వీట్ చేసింది. టీడీపీ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయినట్లు ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నాయి. అంతేకాదు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేస్తున్నారు.
అయితే ప్రాజెక్టు క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయం పక్కన పెడితే.. ఈ బ్యారేజీల ద్వారా నెల్లూరు జిల్లా రైతాంగానికి మంచి జరుగుతుంది.