
- టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి సవాళ్లు కొత్త కాదని, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలు అధిగమించామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు. కోవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా మొదటి సారి పదవి చేపట్టి 27 ఏళ్లు అయ్యిందని, ఈ కాలంలో మనం చేసిన మంచి ఎప్పుడూ గుర్తు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని, పక్కా ఇళ్లు, గురుకులాల వంటి సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయనదేనని నేతలంతా పేర్కొన్నారు. పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదన్నారు. నాడు విజన్‌తో చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉందన్నారు. 27 ఏళ్ల క్రితం చేసిన పనులు.. ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. విభజన వల్ల నష్టం జరిగినా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ప్రభుత్వం మాత్రం ఒక్కో కుటుంబంపై మూడేళ్లలో 3.25 లక్షల భారం వేసిందని విమర్శించారు.
40 శాతం సీట్లు యువతకే..
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో 40 శాతం సీట్లు యువతకే కేటాయించాలని నిర్ణయించారు. మహానాడు విజయవంతమైన విధంగా అంతా పని చేయాలని తీర్మానించారు. పార్టీ ఇన్ ఛార్జ్ హోదా ఇచ్చిన వారూ కార్యక్రమాలు చేయకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం చేసినట్లు తెలిసింది. మూడన్నరేళ్లు అయ్యినా నేతలు యాక్టివ్ కాకపోవడంతో చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను నిర్ణయాలు తీసుకుంటే బాధ పడతారనే ఆలోచిస్తున్నానని వ్యాఖ్యానించారు. నేతల పనితీరు మెరుగుపరుచుకునేందుకు సమయం కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ఇకనైనా పని తీరు మార్చుకుని సభ్యత్వ బాధ్యతలు ఇన్ ఛార్జులు సీరియస్ గా తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే వాళ్లకే పదవులు వచ్చేలా మెకానిజం తీసుకువస్తున్నామన్నారు. క్విట్ జగన్ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.