
tdp senior leader yanamala ramakrishnudu facing tough time in the party
మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం దాకా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఈ సీనియర్ నేతకు సొంత పార్టీలో ఇప్పుడు అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో నంబర్ టూగా అంతా చెప్పుకునే యనమలకు లోకేష్ రూపంలో ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. యనమలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా లోకేష్ పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ లోకేష్‌కీ యనమలకు ఎక్కడ చెడింది.. యనమలకు లోకేష్ ఎందుకు చెక్ పెట్టాలనుకుంటున్నారు..
యనమలకు లోకేష్ షాక్
యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలోని తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు తర్వాత పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దూరంగా ఉంటూ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సోదరుడిని బరిలో దింపినా గెలిపించుకోలేకపోయారు.
యనమలకు షాకిచ్చేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని నారా లోకేష్ డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని లోకేష్ ఇప్పటికే యనమలతో చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం నుంచి అందిన నివేదికల ప్రకారం.. యనమలకు అక్కడ తీవ్ర ప్రతికూలత ఉన్నందునే టికెట్ నిరాకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో యనమల కుటుంబానికి ప్రత్యామ్నాయంపై ఇప్పటికే ఫోకస్ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లోకేష్‌కి, యనమలకు చెడింది అక్కడే..!
యనమల కుటుంబానికి లోకేష్ చెక్ పెట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపు వ్యవహారమే లోకేష్-యనమల మధ్య గ్యాప్‌కు దారితీసిందనే వాదన వినిపిస్తోంది. సదరు కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపుకు లోకేష్ చొరవ తీసుకోగా.. ఆయన పంపించిన ప్రతిపాదనలను అప్పటి ఆర్థిక మంత్రి యనమల తిప్పి పంపించారట. ముందు చంద్రబాబుతో సంతకం చేయిస్తేనే.. ఆ తర్వాత తాను సంతకం పెడుతానని చెప్పారట. దీంతో లోకేష్ చంద్రబాబుతో ఆ బిల్లులపై సంతకం చేయించి.. ఫైల్‌ను యనమల వద్దకు పంపించారట. అప్పటినుంచే ఇద్దరి మధ్య చెడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నివేదికల సాకు చూపి లోకేష్ యనమలకు చెక్ పెట్టేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ యనమల కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే.. పార్టీలో ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్లే అనే చర్చ జరుగుతోంది.