
tdp protest
‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేతలు పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. జగన్ పాలనలో సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు. అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత ,రేషన్ బియ్యం కుంభకోణం తదితర అంశాలపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను వైసీపీ నయ వంచన చేస్తోందన్నారు. నినాదాలు చేసుకుంటూ.. కాలినడకన నేతలు అసెంబ్లీకి వెళ్లారు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా అమలు చేయట్లేదన్నారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారన్నారు.
పేదల పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత రామా నాయుడు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.