
cm jagan orders for kuppam bus service
టీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహం మిస్ ఫైర్ అయింది. సీఎం జగన్ను బద్నాం చేయాలనుకుని.. ఆఖరికి చంద్రబాబును అభాసుపాలు చేసింది. ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఆ కథనంతో.. కుప్పం పట్ల చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మరోసారి స్పష్టమైంది. దీంతో నెటిజన్లు చంద్రబాబుపై మండిపడుతున్నారు.
ఇంతకీ విషయమేంటంటే… ‘జగన్ మామా.. మా ఊరికి బస్సులు వేయించు…’ అంటూ ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాలకు ఇప్పటికీ సరైన బస్సు సౌకర్యం లేదని.. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది దాని సారాంశం. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ప్రతీరోజూ కాలి నడకన 10 కి.మీ దూరంలోని కుప్పంలోని విద్యా సంస్థలకు వెళ్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘జగన్ మామా.. మా ఊరికి బస్సులు వేయించు’ అంటూ జగన్ ఫోటోతో వారు నిరసన తెలిపారని పేర్కొన్నారు.
నిజానికి ఆ విద్యార్థులు చేసింది నిరసన కాదు. జగన్ మామా బస్సు సర్వీస్ వేయించు అంటూ సీఎంకు వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి కుప్పం శివారు ప్రాంతాలకు బస్సు సర్వీస్ మంజూరయ్యేలా ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాలు అందిన వెంటనే అధికారులు బస్సు సర్వీస్ మంజూరు చేశారు. కానీ దీనికి భిన్నంగా విద్యార్థులు సీఎం జగన్పై నిరసన వ్యక్తం చేసినట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. కానీ ఈ ప్రచారం పూర్తిగా బెడిసికొట్టి చంద్రబాబు పరువు పోయేలా చేసింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, దశాబ్ధాలుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కనీసం బస్సు సౌకర్యం కల్పించలేకపోయారా అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్ల చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో చెప్పేందుకు ఇదొక నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.