
inthiyaz arrest
ఇంటర్ విద్యార్థిని లైంగికంగా వేధించి.. ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు జరిగింది ఇదీ..
శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ గొడవ చేశాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.