
ayyanna patrudu arrest
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుని సీఐడీ అరెస్టు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. అయ్యన్నపాత్రుని అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంటి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయడం బాధ కలిగించిందన్నారు.
”అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోంది. ఆయనపై ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారు. చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో.. సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా.. వారి తీరు మారలేదు. పోలీసులు దొంగల్లా ఇళ్లమీద పడి అరెస్టులు చేసే పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా చూశామా? ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ కేసులు.. అరెస్టులు చేస్తున్నారు” – చంద్రబాబు, టీడీపీ అధినేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం.. అయ్యన్న అరెస్టును ఖండించారు. అయ్యన్నను ఉత్తరాంధ్ర పులి అంటూ అభివర్ణించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల దోపిడీ, భూకబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకే బీసీ నేత అయన్నపాత్రుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
అర్థరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి గోడ కేసులో అయన్నపాత్రుడు, రాజేష్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు సీఎం జగన్ మానుకోవాలని సూచించారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అయ్యన్న పాత్రుడు గారికి అండగా మొత్తం తెలుగుదేశం పార్టీ ఉందన్నారు.