
pawan kalyan vizag tour
‘విశాఖ గర్జన’కు వైజాగ్ సిద్ధమవుతున్న వేళ.. పవన్ కల్యాణ్ చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కల్యాణ్ అనూహ్యంగా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టడంపై వైసీపీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ పర్యటన వెనక టీడీపీ అజెండా ఉందా? వైజాగ్ కు వచ్చేందుకు చంద్రబాబుకు ముఖం చెల్లక.. పవన్ ను పంపిస్తున్నారా? విశాఖ గర్జను పక్కదోవ పట్టించేందుకు పవన్ విశాఖకు వెళ్తున్నారన్న మంత్రి రోజా మాటల్లో నిజమెంత?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అయితే ఒక రాజకీయ నాయకుడు.. తన పార్టీ కార్యక్రమాల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంటుంది. ‘విశాఖ గర్జన’ వేళ.. పవన్ పర్యటన ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా ‘విశాఖ గర్జన’ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. పవన్ పర్యటనను ఖరారు చేయడంపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
15న జరిగే విశాఖ గర్జన కోసం ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజలు రానున్నారు. గర్జనను సక్సెస్ చేయడం కోసం జేఏసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకోసం తగిన ఏర్పాట్లను చేస్తోంది. అయితే అదే రోజు పవన్ విశాఖకు వస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్ వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలకాలని జనసేన పార్టీ నిర్ణయించింది. విశాఖ గర్జనను పక్కదోవ పట్టించేందుకు.. ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకే పవన్ విశాఖకు వస్తున్నట్లు జేఏసీతో పాటు మంత్రి రోజా ఆరోపిస్తున్నారు. పవన్ విశాఖకు రావాలనుకుంటే.. వేరే రోజు రావొచ్చని, పని గట్టుకొని.. అదే రోజు రావడంపై ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు దూత.. ?
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన వెనుక.. టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉన్నట్లు వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారు. దీంతో విశాఖను రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంకిగా చంద్రబాబు మారారని స్థానిక టీడీపీ నేతలు సైతం అనుకుంటున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారికి నేరుగా ముఖం చూపించలేని చంద్రబాబు.. తన దత్తపుత్రుడు అయిన.. పవన్ ను ఉత్తరాంధ్రకు పంపుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ తన సినిమా ఇమేజ్ తో 15న వైజాగ్ లో గందరగోళ పరిస్థితులు సృష్టించే అవకాశం ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కు తగునా?
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన.. విశాఖ గర్జనకు వ్యతిరేకంగా కాదని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకంగా చేపడుతున్నదని జేఏసీ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం పవన్ కు తగునా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఆదేశాల మేరకు పవన్ ఈ పర్యటన చేపడుతున్నట్లు జేఏసీ చెబుతోంది.
చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన!
అమరావతిలో తమ భూస్వాములను కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలను చంద్రబాబు పణంగా పెట్టాలని చూస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతులపై ఉన్న శ్రద్ధ.. ఉత్తరాంధ్ర జనాలపై చంద్రబాబుకు, టీడీపీకి లేదని మండిపడుతున్నారు. చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచనకు పవన్ కల్యాణ్ వంత పాడుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏజెంట్ గానే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నట్లు తాము భావిస్తున్నట్లు జేఏసీ నాయలుకు నొక్కి వక్కాణిస్తున్నారు.